PM Modi in Haryana: మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రధాని మోదీ శనివారం హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హరియాణాలో జరిగిన తొలి ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ కుటుంబం ఎప్పుడూ ఓబీసీలు, దళితులు, గిరిజనులను అవమానిస్తూనే ఉందని మోదీ విమర్శించారు. ‘‘నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రిజర్వేషన్లను వ్యతిరేకించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారని, అందుకు సంబంధించిన ఆధారాలు అందుబాటులో ఉన్నాయి’’ అని మోదీ అన్నారు. రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలు లభిస్తే ప్రభుత్వ సేవల నాణ్యత క్షీణిస్తుందని కూడా నెహ్రూ చెప్పారని మోదీ ఆరోపించారు.
ఇందిరాగాంధీ ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఓబీసీ రిజర్వేషన్లపై స్టే పెట్టిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ‘‘రాజీవ్ గాంధీ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. ఓ ఇంటర్వ్యూలో రిజర్వేషన్లు పొందిన వారిని 'బుద్ధు' అని కూడా పిలిచారు’’ అని మోదీ పేర్కొన్నారు. హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలని స్థానిక ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.