Allu Arjun Arrested: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్, చిక్కడపల్లి పీఎస్‌కు తరలింపు
Allu Arjun Arrested: పుష్ప2 మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సినీ నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు.
Allu Arjun Arrest: పుష్ప 2 సినిమా ప్రివ్యూ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు బాధ్యుడిగా సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. అనంతరం అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు. 4వ తేదీ రాత్రి పది గంటలకు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చారు.
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఎల్‌బినగర్‌కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులు సీపీఆర్ చేసి బాలుడిని కాపాడారు. అల్లు అర్జున్ రాక గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నాన్ బెయిలబుల్ కేసులు
అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిఎన్‌ఎస్ సెక్షన్లు 105, 118(1) రెడ్ విత్ 3(1) ప్రకారం కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోడానికి కారణమైనందుకు అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షల కోసం తరలించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంట్లో మొదటి అంతస్తులో ఉన్న అల్లు అర్జున్ వద్దకు చేరుకున్న టాస్క్‌ఫోర్స్, చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. ఇంట్లో షార్ట్స్ ధరించి ఉన్న అల్లు అర్జున్ లిఫ్ట్‌లో కిందకు తీసుకు వచ్చిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. బెడ్‌రూమ్‌లో ఉన్న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పడంతో పోలీసులకు సహకరిస్తూనే దుస్తులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వరా అని అడిగినట్టు తెలుస్తోంది. లిఫ్ట్‌లో కిందకు వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు పోలీసులు అనుమతించారు. పోలీస్ వాహనంలో ఎక్కే ముందు పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. బట్టలు మార్చుకోడానికి అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ అరెస్ట్ సమాచారం అందుకున్న అల్లు అర్జున్ తండ్రి అరవింద్ అక్కడకు చేరుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్‌ను బాధ్యుడిగా చేస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి కూడా పోలీస్ వాహనంలో పీఎస్‌కు వెళ్లారు.
క్వాష్ పిటిషన్ పై విచారణ
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ దాఖలైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ప్రీమియర్ షో సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడాన్ని పోలీసులు తప్పు పడుతున్నారు.
పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సినిమా థియేటర్ వద్దకు నటుడు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రేక్షకుల రద్దీకు తగ్గట్టు ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఈ ఘటనకు అ్లలు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్‌కు చెందిన 8 మంది భాగస్వాములతో పాటు మేనేజర్, ఇతర సిబ్బందిపై కేసు నమోదు చేశారు.