Anantapur Tragedy : అనంతపురం జిల్లాలో విషాదం.. భర్త వేధింపులు.. భార్య, కుమారుడు మృతి
Anantapur Tragedy : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక భార్య సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు యత్నించారు. ఇందులో భార్య, కుమారుడు మృతి చెందగా.. కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నెలో గురువారం తీవ్ర విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గార్లదిన్నె మండలంలోని యర్రగుంట్లకు చెందిన సురేష్‌కు.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం నల్లచెరువు గ్రామానికి చెందిన సుజాత (35)కు దాదాపు 20 ఏళ్ల కిందట వివాహం అయింది. సురేష్, సుజాత దంపతులకు కుమార్తె సాహిత్య, కుమారుడు నాగ చైతన్య (9) ఉన్నారు. కుమార్తె సాహిత్య ప్రస్తుతం చెన్నై ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. నాగ చైతన్య గార్లదిన్నెలోనే ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు.
సురేష్, సుజాత కుటుంబం మూడేళ్ల కిందట యర్రగుంట్ల నుంచి గార్లదిన్నె వచ్చారు. అక్కడే అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. సుజాత కిరాణా షాపు, చీరల వ్యాపారం నిర్వహిస్తోంది. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య గొడవులు జరుగుతుండేవి. సుజాతను భర్త సురేష్ సూటిపోటి మాటలతో వేధించేవాడు. దీంతో జీవితంపై సుజాత విరక్తి చెందింది. బంధువుల వివాహం కోసం సాహిత్య చెన్నై నుంచి నాలుగు రోజుల కిందటే యర్రగుంట్ల గ్రామానికి వచ్చింది. బుధవారం కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పెళ్లిని చూసుకోని, అదే రోజు రాత్రి తల్లిదండ్రులతో పాటు సాహిత్య కూడా గార్లదిన్నెకు వచ్చింది.
గురువారం కుటుంబంతో ఉండి శుక్రవారం సాహిత్య కాలేజీ (చెన్నై)కి వెళ్లాల్సి ఉంది. అయితే పెళ్లిలో సుజాతను భర్త సురేష్ సూటిపోటి మాటలతో వేధించాడు. దీంతో గురువారం ఉదయం ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో సుజాత తీవ్ర మనస్థాపనకు గురై విషపగుళికలు కలిపిన నీళ్లను ఇద్దరు పిల్లలకు తాగించి, తాను కూడా తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆ సమయంలో సాహిత్య, నాగచైతన్యకు అనుమానం వచ్చింది. దీంతో తల్లి సుజాతను ఏంటమ్మా ఇది అని అడిగారు. నూలిపురుగుల నివారణ మందు అని చెప్పి పిల్లలకు తాగించింది.
తొలిత అమ్మ అపస్మారక స్థితిలో పడిపోయింది. దీంతో కుమార్తె సాహిత్య బయటకు వెళ్లి కేకలు వేసింది. దీంతో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురిని అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తల్లి సుజాత మృతి చెందింది. ఈ విషయం తెలియని కుమారుడు నాగ చైతన్య ఐసీయూలో చికిత్స పొందుతుండగానే తల్లిని తలుచుకున్నాడు. అమ్మ ఎక్కడుంది. అమ్మ దగ్గరకు తీసుకోపోవాలని చేసిన అభ్యర్థన అందరిని కలచివేసింది.
మెరుగైన వైద్యం కోసం సాహిత్య, నాగ చైతన్యలను బెంగళూరు తరలించారు. మార్గమధ్యంలోనే నాగ చైతన్య మృతి చెందాడు. కుమార్తె సాహిత్య బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సుజాత, నాగ చైతన్య మృతదేహాలకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. సమాచారం అందుకున్న సుజాత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో అనంతపురం ఆసుపత్రికి చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న సుజాత, చైతన్యలను చూసి బోరున విలపించారు. కుటుంబ సభ్యల రోదనల తీరు చూసి అక్కుడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు.
పెళ్లిలో జరిగిన ఘటనతో జీవితంపై విరక్తి చెంది ఈ చర్యకు ఒడిగట్టిందని సుజాత సోదరుడు రామయ్య తెలిపారు. అయితే భర్త సురేష్ తరచూ సుజాతను సూటిపోటి మాటలతో వేధిస్తుండేవాడని, పిల్లల కోసమే భరిస్తూ వచ్చిందని బంధువులు తెలిపారు. చిన్న, చిన్న విషయాలకే ఘర్షణ పడి నెల రోజులైనా భార్యతో మాట్లాడేవాడు కాదని అన్నారు. సురేష్ పెట్టిన మానసిక వేధింపులతోనే సుజాత పిల్లలతో కలిసి చనిపోవాలనుకుందని పోలీసులకు సుజాత సోదరుడు రామయ్య ఫిర్యాదు చేశారు. సుజాత, నాగ చైతన్య మృతికి సురేష్ కారణమని పేర్కొన్నారు. దీంతో సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహ్మద్ బాషా తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)