Vizianagaram MLC Election 2024 : విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికలు - వైసీపీ అభ్యర్థి ఖరారు, లెక్కలివే..!
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వెంకట చిన అప్పల నాయుడు పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ప్రకటించారు. బుధవారం పార్టీ నాయకులతో సమావేశమైన జగన్… సమాలోచనలు చేసి నిర్ణయం తీసుకున్నారు.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును వైసీపీ ఖరారైంది. ఆ పేరు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును ఖరారు చేస్తూ ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం పార్టీ నాయకులతో సమావేశమైన జగన్… వారందరి అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ నాయకులు వ్యక్తంచేసిన ఏకాభిప్రాయం మేరకు అప్పలనాయుడు పేరును ప్రకటిస్తున్నట్టు జగన్ వెల్లడించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌నేత బొత్సకు అవకాశం ఇచ్చిన దృష్ట్యా, ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడు పేరును పార్టీ నేతలంతా బలపరిచినందున ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ తెలిపారు.
అనుభవం, సామాజిక వర్గం రీత్యా అప్పలనాయుడు పేరును ప్రకటించామన్నారు. అప్పలనాయుడు అనుభవజ్ఞుడు, సీనియర్ అయినందున అందరి గౌరవాన్ని పొందుతారన్నారు. సమిష్టి కృషితో విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకున్నామని… విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీనికూడా అదే స్ఫూర్తితో గెలుచుకోవాలని పార్టీనేతలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు చెందిన మొత్తం ప్రతినిధుల సంఖ్య 753గా ఉంది. ఇందులో 592 మంది వైయస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులుగా గెలుపొందిన వారు ఉన్నారని జగన్ పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థి చిన అప్పలనాయుడు సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉండి కొనసాగుతున్నారని తెలిపారు. బొబ్బిలి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన శంబంగి వెంకట చినఅప్పలనాయుడు… 2019లో ప్రొటెం స్పీకర్‌గా కూడా పని చేశారు.
ఎన్నికల షెడ్యూల్:
- విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 4 నుంచి నామినేషన్లు షురూ అయ్యాయి. నవంబర్ 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు.
- ఈ నెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అనంతరం ఈ నెల 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
- నవంబర్ 28వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 1వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
- విజయనగరం జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తుంది. రెండున్నరేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మొత్తం 34 జడ్పీటీసీ స్థానాలు, 389 ఎంపీటీసీ స్థానాలకు గానూ 389 స్థానాల్లో విజయం సాధించింది.
ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ హైకమాండ్ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి పూర్తి బలం ఉండడంతో టీడీపీకి ఈ సీటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ... కాబట్టి అధికార పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండొచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ తుది నిర్ణయమేంటో తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనం