Vizianagaram Mlc Elections : విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఈ నెల 28న పోలింగ్- మళ్లీ వైసీపీకే ఛాన్స్!
Vizianagaram Mlc Elections : విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటించింది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 28న ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తారు.
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 4 నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈ నెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అనంతరం ఈ నెల 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్ 28వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 1వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
విజయనగరం జిల్లాలో ఎలక్షన్ కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. టీడీపీతో టచ్ లోకి వెళ్లారని వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజును పార్టీ నుంచి బహిస్కరించింది. అనంతరం శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. మండలి ఛైర్మన్...ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీంతో విజయగనరం జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. జూన్ 3 నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటన రద్దైంది. ఇవాళ విజయనగరం జిల్లా మినహా అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. శ్రీకాకుళం నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకు వెళ్లారు. అక్కడ రోడ్ల గుంతలు పూడ్చి వేత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మళ్లీ వైసీపీకే ఛాన్స్
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తుంది. ఈ స్థానానికి తాజాగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికల కోడ్ ఇప్పటికే అమల్లోకి రావడంతో గజపతినగరంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన సైతం రద్దైంది. రెండున్నరేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మొత్తం 34 జడ్పీటీసీ స్థానాలు, 389 ఎంపీటీసీ స్థానాలకు గానూ 389 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో విభేదాలు ఉండడంతో ఆయన పేరు వైసీపీ పరిశీలించే అవకాశం ఉంది.
కడుబండి శ్రీనివాసరావు జిల్లాలో బలంగా ఉన్న కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందినవారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని కూడా వైసీపీ పరిశీలిస్తుంది. టీడీపీ తన అభ్యర్థిని నిలబెడితే... ఆ అభ్యర్థికి తగిన విధంగా వైసీపీ ఇతరుల పేర్లను పరిశీలించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్.కోట సీటు దక్కని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి తన పేరును పరిశీలించాల్సిందిగా టీడీపీ హైకమాండ్ అభ్యర్థించవచ్చు.
ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ హైకమాండ్ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి పూర్తి బలం ఉండడంతో టీడీపీకి ఈ సీటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ... కాబట్టి అధికార పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండొచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
సంబంధిత కథనం