TG Graduate MLC Voter Registration : ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? దగ్గరపడిన గడువు, దరఖాస్తు విధానం ఇలా...-graduate mlc election for medak nizamabad adilabad karimnagar applications ends on 6th november 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Graduate Mlc Voter Registration : ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? దగ్గరపడిన గడువు, దరఖాస్తు విధానం ఇలా...

TG Graduate MLC Voter Registration : ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? దగ్గరపడిన గడువు, దరఖాస్తు విధానం ఇలా...

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 02, 2024 11:36 AM IST

Telangana MLC Elections 2025 : ఉత్తర తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల (నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్)కు సంబంధించి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ గడువు నవంబర్ 6వ తేదీతో పూర్తి కానుంది. సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

ఉత్తర తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉత్తర తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. వచ్చే ఏడాది నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. 4 జిల్లాల పరిధిలో ఉన్న ఆయా నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు దరఖాస్తు చేసుకుంటున్నారు.

దగ్గరపడిన గడువు…!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియ నవంబర్ 6వ తేదీతో ముగియనుంది. మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు అవగాహన నమోదు కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మరోవైపు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు… కూడా గ్రాడ్యూయేట్ ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు.

గడువు పెంచుతారా..?

ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంచాలని పలు రాజకీయ పార్టీలు ఈసీని కోరుతున్నాయి. ఇదే అంశంపై కరీంనగర్ బీఆర్ఎస్ నేతలు… ఎన్నికల సంఘం అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువు పెంచాలని కోరారు. అయితే ఈ విషయంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ 4 జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనుంది. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పించింది. అసిస్టెంట్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఏఈఆర్ఓ) కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈనెల 23న ముసాయిదా జాబితా…!

గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన మీదట నవంబర్ 23 న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుంది. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుండి డిసెంబర్ 09 వ తేదీ వరకు తెలియజేయాలి. 2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను వెలువరిస్తారు.

దరఖాస్తు విధానం ఎలా..?

  • గ్రాడ్యూయేట్ ఓటు నమోదు కోసం ఫారమ్ - 18 ద్వారా ఓటరు నమోదు దరఖాస్తును పూర్తి చేయాలి.
  • గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆన్ లైన్ లో చేసుకోవాలనుకునే వారు ముందుగా https://ceotelangana.nic.in/home.html సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే MLC Graduates - Teacher ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. 1) Graduates' - 2024 2) Teachers' - 2024 కనిపిస్తాయి. 3) Form-18 (Graduates') "Apply Online" "Download Offline Form" అనే ఆప్షన్ ఉంది. అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీ Graduate Constituencyని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • అడ్రస్, ఆధార్, విద్యార్హతలను ఎంట్రీ చేయాలి. డిగ్రీ సర్టిఫికెట్, ఫొటోను అప్ లోడ్ చేాయాలి.
  • చివర్లో మీ మొబైల్ నెంబర్, మెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
  • ఫైనల్ గా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
  • ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ సాయంతో మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ లింక్స్ :

  1. గ్రాడ్యూయేషన్ ఓటర్ నమోదు కోసం లింక్ - https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx
  2. టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కోసం లింక్ - https://ceotserms2.telangana.gov.in/mlc/form19.aspx

Whats_app_banner