TS Assembly Election Schedule: మరికాసేపట్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్..ఐదు రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా
TS Assembly Election Schedule: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మరికాసేపట్లో మోగనుంది. సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.
TS Assembly Election Schedule: తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది.అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరికాసేపట్లో విడుదల కానుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల బృందం కసరత్తును పూర్తి చేసింది. ఏర్పాట్లు పూర్తి కావడంతో ఎన్నికల షెడ్యూల్‌ను నేడు విడుదల చేయనున్నారు.
తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లను పర్యవేక్షించింది. అధికారికంగా ఈసీ సోమవారం మధ్యాహ్నం ప్రకటించనుంది.
తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ గడువు త్వరలో ముగియనుంది. గడువుకు ముందే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాల్సి ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి మరింత పెరుగుతుంది.
ఐదు రాష్ట్రాల్లో నవంబర్ రెండో వారం నుంచి- డిసెంబర్ మొదటి వారం వరకు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్ని దశల్లో పోలింగ్ జరుగుతుందనే దానిపై నేడు స్పష్టత రానుంది. తెలంగాణలో ఒకే దశలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసే అవకాశాలు ఉన్నాయి. 2018లో ఒకే రోజు ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్లో రెండు దశల్లో పోలింగ్ జరగొచ్చు. మిగిలిన రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికలు ముగిసే అవకాశం ఉంది.
తెలంగాణ:
2014 నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. మెజారిటీ సాధించాలంటే 60 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్కు 19 సీట్లు దక్కాయి. బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది.
ఛత్తీస్గఢ్:-
ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాల్లో గెలవాలి. 2018లో 68 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి 15 సీట్లు మాత్రమే దక్కాయి. సిఎం భూపేష్ భగేల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది.
రాజస్థాన్:
2018లో అప్పటివరకు అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది కాంగ్రెస్. 200 సీట్ల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ పొందాలంటే 101 స్థానాల్లో గెలవాల్సి ఉంది. నాటి ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ 108 సీట్లు సాధించింది కాంగ్రెస్. బీజేపీకి 73 సీట్లు మాత్రమే దక్కాయి.
మధ్యప్రదేశ్:
మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. 116 మ్యాజిక్ ఫిగర్. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో 114 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్. బీజేపీకి 109 స్థానాలే దక్కాయి. బీజేపీ కంటే ముందే పావులు కదిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవలేదు. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో.. కొన్నేళ్లకే కుప్పకూలింది. జ్యోతిరాదిత్య సింధియా.. బీజేపీకి మద్దతు పలికారు. ఆ తర్వాత.. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , మిజోరాం, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ మరికాసేపట్లో విడుదల కానుంది.
తెలంగాణలో అసెంబ్లీ గడువు 2024 జనవరి 16 వరకు ఉంది. 2018 ఎన్నికలను చూస్తే… అక్టోబర్ 6వ తేదీన ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సరిగ్గా రెండు నెలలకు అంటే డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించింది. గెలిచిన వారితో జనవరి 17న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రకారం చూస్తే…. వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ వరకు ప్రస్తుత అసెంబ్లీ మనుగడలో ఉండనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.