TS Prajavani : ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్, ప్రజాభవన్ ప్రజావాణికి బ్రేక్
TS Prajavani : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం ప్రజావాణికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణిని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
TS Prajavani : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ ను ప్రజాభవన్(Prajabhavan) గా మార్చి...ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు 'ప్రజావాణి'(TS Prajavani) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్ పడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎలక్షన్ కోడ్(Election Code) అమల్లోకి వచ్చింది. దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నోడల్ అధికారి తెలిపారు. తిరిగి జూన్ 7న ప్రజావాణి తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రజాభవన్ లో ప్రజావాణి
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత దీనిని ప్రజావాణిగా(Prajavani) మార్చారు. ప్రజావాణిలో వినతులు సమర్పించేందుకు ప్రజలకు ప్రజాభవన్ పెద్ద సంఖ్యలో వచ్చేవారు. మరోవైపు గత ప్రభుత్వం సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న ప్రగతి భవన్ ను డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చిన సంగతి తెలిసిందే. ప్రతి మంగళవారం, శుక్రవారం హైదరాబాద్ బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఒక్కో రోజు ఒక్కో శాఖకు చెందిన మంత్రులు ప్రజావాణిలో పాల్గొని ప్రజాసమస్యలపై వినతులు స్వీకరిస్తారు. ప్రజాసమస్యల పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహిస్తారు. ఒక్కో ప్రజావాణిలో వేల సంఖ్యలో ప్రజా సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం రంగారెడ్డి (Rangareddy)కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా ఎన్నికల ప్రధానాధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణిని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రజావాణి (Prajavani)రద్దు చేయనున్నట్లు తెలిపారు. అయితే మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కారణంగా ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి 26 నుంచే అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు గుర్తుచేశారు. తాజాగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Elections) రావడంతో ఎన్నికల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రజావాణిని తిరిగి కొనసాగిస్తామన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దాదాపుగా అన్ని జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే తిరిగి ప్రజావాణి ప్రారంభిస్తామని కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు.