AP Waqf Board : ఏపీ వక్ఫ్ బోర్డును పునర్ నియామకం, న్యాయపోరాటానికి సిద్ధమంటున్న మాజీ డిప్యూటీ సీఎం
AP Waqf Board : ఏపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును పునర్ నియమించింది. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన బోర్డును కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. తాజాగా జీవో నెంబర్ 77 ప్రకారం కొత్త బోర్డును ప్రకటించింది. అయితే ఇది చట్ట విరుద్ధమని వైసీపీ నేత అంజద్ బాషా ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డును పునర్ నియామకం చేపట్టింది. దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 77ను కూడా విడుదల చేసింది. అయితే వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీ అయిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో నెంబర్ 47ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 75 విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
వక్ఫ్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునర్ నియమించింది. దీనికి సంబంధించి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ జీవోఎంఎస్ నెంబర్ 77ను విడుదల చేశారు. వక్ఫ్ చట్టం- 1995లోని సెక్షన్ (14)లోని సబ్-సెక్షన్ (9), సెక్షన్ (15) ప్రకారం ఎనిమిది మందితో వక్ఫ్ బోర్డును నియామకం చేపట్టినట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
వక్ఫ్ బోర్డు సభ్యులు వీరే
ఎన్నికైన సభ్యుల కోటాలో ఎండీ రుహుల్లా (ఎమ్మెల్సీ), షేక్ ఖాజా (ముతవల్లీ)లను నియమించింది. నామినేటెడ్ సభ్యులుగా మహ్మద్ నసీర్ (ఎమ్మెల్యే), సయ్యద్ దావుద్ బాషా బాక్వీ, షేక్ అక్రమ్, అబ్దుల్ అజీజ్, హాజీ ముకర్రమ్ హుస్సేన్, మహ్మద్ ఇస్మాయేల్ బేగ్‌లను నియమించారు. వక్ఫ్ చట్టం-1995లోని సెక్షన్ 14లోని సబ్-సెక్షన్ (8) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు తమలో ఒకరిని బోర్డు చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుల పదవీకాలం సెక్షన్ 21 ప్రకారం ఉంటుంది.
ప్రభుత్వ చర్యలపై విమర్శలు
అయితే వక్ఫ్ బోర్డును నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా వక్ఫ్ బోర్డు నియామకం తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారని, కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు పునర్ నియామక జోవో ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలోని ఏ సెక్షన్ల కింద నియామకం జరిగిందో, ఇప్పుడు కూడా అదే సెక్షన్ల కింద పునర్ నియామం చేయాలని అన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. ఇందులో ఎంపీ, అడ్వకేట్, మహిళా, అధికారిక విభాగాల నుంచి సభ్యులకు చోటు లేదని విమర్శించారు.
న్యాయ పోరాటానికి సిద్ధం
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోఎంఎస్ నెంబర్ 77పై తాము న్యాయ పోరాటం చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడించారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ఏ బోర్డుకైనా ఐదేళ్ల పదవీ కాలం ఉంటుందని, 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డును, ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేయలేదని తెలిపారు. 2023 వరకూ అదే బోర్డు కొనసాగిందని గుర్తు చేశారు.
2023లో వైసీపీ ప్రభుత్వం కొత్త వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసిందని, బోర్డులో నామినేట్ సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుందని అన్నారు. చైర్మన్ ఎన్నిక జరగడానికి ఒక రోజు ముందు టీడీపీ నేతలు హైకోర్టులో నాలుగు పిటిషన్లు వేసి, స్టే విధించేటట్లు చేశారని గుర్తు చేశారు. అందువల్ల వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎన్నిక మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డు పనిచేయలేదనే కారణంతో ఇటీవలి రద్దు చేశారని, తాజాగా కొత్తగా బోర్డు సభ్యులను నియమిస్తూ జీవోఎంఎస్ నెంబర్ 77ను విడుదల చేశారని విమర్శించారు.
ఆ జీవో మొత్తం తప్పులు తడకలగా ఉందని, అసలు బోర్డులోనే సభ్యుడు కానీ అబ్దుల్ అజీజ్‌ను చైర్మన్‌గా పేర్కొనడం దారుణంగా ఉందని అన్నారు. బోర్డు సభ్యులంతా కలిసి ఎన్నుకోవాల్సిన చైర్మన్‌ను సీఎం చంద్రబాబు ముందే ఎలా ప్రకటిస్తారని విమర్శించారు. వక్ఫ్ ఆస్తులను కాజేయాలని దురుద్దేశంతోనే ఇలా చేశారని, దీనిపై తాము న్యాయ పోరాటు చేస్తామని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయంలోనే వక్ఫ్ బోర్డు
2023 అక్టోబర్ 21న అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నామినేట్ చేస్తూ జీవో నెంబర్ 47ని విడుదల చేసింది. ఎన్నికైన సభ్యులు ఎండి. రుహుల్లా (ఎమ్మెల్సీ), హాఫీజ్ ఖాన్ (ఎమ్మెల్యే), షేక్ ఖాజా, నామినేటేడ్ సభ్యులు ఖాదీర్ బాషా, మీరా హుహ్సేన్, షాఫీ అహ్మద్ ఖాద్రీ, షీరీన్ బేగం (ఐపీఎస్), బరకత్ అలీ, జే నజీర్ బాషా, పటన్ షాఫీ అహ్మద్, హాసీనా బేగంలతో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారు.
అయితే ఈ నియామకాల తీరుపై కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు 2023 నవంబర్ 1న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వివిధ రకాల న్యాయపరమైన సమస్యల తలెత్తిన కారణంగ వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడింది. దీంతో గత ప్రభుత్వం జారీ చేసిన 47 జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. జీవో నెంబర్ 47ను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నూతనంగా జీవో నెంబర్ 75ను విడుదల చేసింది.
అయితే ఐదేళ్ల కాలపరిమితి ఉండే వక్ఫ్ బోర్డును అర్థంతరంగా రద్దు చేయడం, వేరే సభ్యులతో బోర్డును పునర్ నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపట్ల ముస్లీం సంఘాలు, ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని వైసీపీ వెల్లడించింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు