Lionel Messi: మాంచెస్టర్ సిటీకి లియోనెల్ మెస్సీ.. అర్జెంటీనా స్టార్‌పై ఆసక్తి చూపుతున్న గార్డియోలా
Lionel Messi: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ.. మాంచెస్టర్ సిటీ క్లబ్ లోకి వెళ్తున్నాడా? ఆ క్లబ్ మేనేజర్ పెప్ గార్డియోలా అతనిపై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ టీమ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండటంతో మెస్సీలాంటి ప్లేయర్ కోసం చూస్తోంది.
Lionel Messi: లియోనెల్ మెస్సీ మరోసారి క్లబ్ మారబోతున్నాడా? ఇంటర్ మియామీ నుంచి ప్రీమియర్ లీగ్ కు తిరిగి రాబోతున్నాడా? మాంచెస్టర్ సిటీ అతనిపై ఆసక్తి చూపుతుండటం ఈ సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆ టీమ్ దారుణమైన పరిస్థితుల్లో ఉంది. గత 11 మ్యాచ్ లలో 8 ఓడి, రెండు డ్రా చేసుకొని, కేవలం ఒక దాంట్లోనే గెలవడంతో మళ్లీ టీమ్ ను గాడిలో పెట్టే క్రమంలో భాగంగా మేనేజర్ పెప్ గార్డియోలా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మాంచెస్టర్ సిటీకి మెస్సీ
మాంచెస్టర్ సిటీ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో జట్టును మళ్లీ గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టేందుకు మేనేజర్ గార్డియోలా సిద్ధమవుతున్నాడు. అందులో భాగంగానే అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీపై కన్నేశాడు. ప్రస్తుతం అతడు ఇంటర్ మియామీతో ఉన్నాడు. రాబోయే వింటర్ ట్రాన్స్‌ఫర్ విండోలో మెస్సీతో అగ్రిమెంట్ కోసం ప్రయత్నిస్తోంది మాంచెస్టర్ సిటీ. గాయం వల్ల కెప్టెన్ రోడ్రీ లేకపోవడంతో అతని స్థానాన్ని మెస్సీతో భర్తీ చేయాలని మేనేజర్ గార్డియోలా భావిస్తున్నాడు.
అయితే మెస్సీని ఆరు నెలల పాటు తీసుకొని మళ్లీ జట్టును ట్రాక్ పైకి తీసుకురావాలన్నది అతని ఉద్దేశంగా కనిపిస్తోంది. దీనికి ఇంటర్ మియామీ కోఓనర్ గా ఉన్న డేవిడ్ బెక్‌హామ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చని భావిస్తున్నారు. గతేడాది జులై నుంచి మెస్సీ.. ఇంటర్ మియామీతో ఉన్నాడు. ఆ టీమ్ తరఫున 39 మ్యాచ్ లు ఆడిన అతడు.. 34 గోల్స్ చేయగా.. మరో 18 గోల్స్ లో సాయం చేశాడు. అలాంటి స్టార్ ప్లేయర్ టీమ్ లోకి వస్తే మాంచెస్టర్ సిటీ మళ్లీ గెలుపు బాట పడుతుందన్న ఉద్దేశంతో గార్డియోలా ఉన్నాడు.
మాంచెస్టర్ సిటీ ఫామ్ ఇలా..
మాంచెస్టర్ సిటీ ప్రస్తుత ఫామ్ దారుణంగా ఉంది. ఆ టీమ్ ఆడిన చివరి 11 మ్యాచ్ లలో ఎనిమిది ఓడింది. కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. ఈఎఫ్ఎల్ కప్ రౌండ్ 16 వరకు టీమ్ పరిస్థితి బాగానే ఉంది. ఆ మ్యాచ్ ఓటమి తర్వాత టీమ్ పూర్తిగా గాడి తప్పింది. కెప్టెన్ రోడ్రి లేని టీమ్ వరుసగా ఓడిపోతూ వస్తోంది. ఈ మధ్యే నాటింగామ్ తో మ్యాచ్ లో 3-0తో గెలిచింది. అయితే ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో ఒకటి డ్రా కాగా.. మరో రెండింట్లో ఓడిపోయింది.