PV Sindhu Venkata Datta Sai: పీవీ సింధు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరో తెలుసా.. చదువులో దిట్ట, మేటి ఉద్యోగం-pv sindhu wedding who is venkata datta sai husband to be of badminton star ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pv Sindhu Venkata Datta Sai: పీవీ సింధు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరో తెలుసా.. చదువులో దిట్ట, మేటి ఉద్యోగం

PV Sindhu Venkata Datta Sai: పీవీ సింధు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరో తెలుసా.. చదువులో దిట్ట, మేటి ఉద్యోగం

Hari Prasad S HT Telugu
Dec 03, 2024 10:26 AM IST

PV Sindhu Venkata Datta Sai: పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందన్న వార్త ఎంతలా వైరల్ అయిందో మనకు తెలుసు కదా. అయితే ఇప్పుడామె కాబోయే భర్త వెంకట దత్త సాయి గురించి కూడా ఇంటర్నెట్ లో అభిమానులు తెగ వెతికేస్తున్నారు.

పీవీ సింధును చేసుకోబోతున్న ఈ వెంకట దత్త సాయి ఎవరో తెలుసా.. చదువులో దిట్ట, మేటి ఉద్యోగం
పీవీ సింధును చేసుకోబోతున్న ఈ వెంకట దత్త సాయి ఎవరో తెలుసా.. చదువులో దిట్ట, మేటి ఉద్యోగం (PV Sindhu-X)

PV Sindhu Venkata Datta Sai: బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు డిసెంబర్ 22న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలుసు కదా. సోమవారం (డిసెంబర్ 2) రాత్రి ఈ వార్త బయటకు రాగా.. వెంటనే వైరల్ అయింది. ఆమె సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ అయిన వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంటోందని తెలియడంతో ఆయన ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి నెటిజన్లలో కలిగింది.

ఎవరీ వెంకట దత్త సాయి?

పీవీ సింధు కాబోయే భర్త పేరు వెంకట దత్త సాయి. ప్రస్తుతం ఆయన పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గత నెలలో ఈ పోసిడెక్స్ టెక్నాలజీస్ కొత్త లోగోను సింధుయే లాంచ్ చేయడం విశేషం.

ఈ వెంకట దత్త సాయి అదే పోసిడెక్స్ ఎండీ, మాజీ ఐఆర్ఎస్ అయిన జీటీ వెంకటేశ్వర్ రావు తనయుడే. దీంతో తన కంపెనీలోనే సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

చదవులో దిట్ట వెంకట దత్త సాయి

పీవీ సింధు బ్యాడ్మింటన్ లో ప్రపంచం మెచ్చిన స్టార్ ప్లేయర్ కాగా.. ఆమె కాబోయే భర్త మాత్రం చదువులో దిట్ట. ఆయన బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్ పై మాస్టర్స్ డిగ్రీ చేశారు.

పోసిడెక్స్ లో ఉద్యోగానికి ముందు సాయి జేఎస్‌డబ్ల్యూతోపాటు సౌర్ ఆపిల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఎండీగా పని చేశారు. 2019 నుంచి పోసిడెక్స్ లో చేస్తున్నట్లు ఆయన లింక్డిన్ ప్రొఫైల్ చూస్తే తెలుస్తోంది.

నెల కిందటే పెళ్లి ఖాయం

వరుసగా రెండు ఒలింపిక్స్ లో మెడల్స్ గెలిచిన పీవీ సింధు కొన్నాళ్లుగా చెప్పుకోదగిన విజయాలు సాధించలేకపోయింది. ఈ మధ్యే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ వుమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచి మళ్లీ గాడిలో పడింది. ఇంతలోనే పెళ్లికి సిద్ధమైంది. గత నెలలోనే వీళ్ల సంబంధం ఖాయమైనట్లు ఆమె తండ్రి పీవీ రమణ పీటీఐతో వెల్లడించారు.

"మా రెండు కుటుంబాలకు చాలా రోజులుగా పరిచయం ఉంది. కానీ ఒక నెల కిందటే ఈ సంబంధం ఖాయమైంది. జనవరిలో సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో డిసెంబర్ లోనే పెళ్లి చేయాలనుకున్నాం" అని రమణ తెలిపారు. డిసెంబర్ 22న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో పెళ్లి జరగనుండగా.. డిసెంబర్ 24న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 20 నుంచే వీళ్ల పెళ్లి సందడి ప్రారంభం కానుంది. పెళ్లి, రిసెప్షన్ అయిపోగానే సింధు మళ్లీ తన తర్వాతి టోర్నీలపై దృష్టి సారిస్తుందని ఆమె తండ్రి రమణ చెప్పారు.

వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడెమీ

పీవీ సింధు ఈ మధ్యే వైజాగ్ లో బ్యాడ్మింటన్ అకాడెమీ కోసం భూమి పూజ చేసిన విషయం తెలుసు కదా. పీవీ సింధు సెంటర్‌ బ్యాడ్మింటన్ - స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్‌ పేరుతో ఈ అకాడెమీని ఏర్పాటు చేస్తోంది. ఈ సెంటర్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు అథ్లెట్ల పోషణ, సాధికారత కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు పీవీ సింధు తెలిపింది.

విశాఖపట్నం పరిధిలోని అరిలోవా ఏరియాలో ఈ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణ పనులకు గురువారం తన తల్లిదండ్రులతో కలిసి పీవీ సింధు భూమి పూజ చేసింది.

Whats_app_banner