CM Revanth Reddy : ఆ ప్రసంగం తర్వాత ఛాంబర్ కు పిలిపించారు - రోశయ్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం రేవంత్-cm revanth reddy told interesting things about former cm konijeti rosaiah ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ఆ ప్రసంగం తర్వాత ఛాంబర్ కు పిలిపించారు - రోశయ్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy : ఆ ప్రసంగం తర్వాత ఛాంబర్ కు పిలిపించారు - రోశయ్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం రేవంత్

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 04, 2024 05:03 PM IST

హైదరాబాద్ లో మాజీ సీఎం రోశయ్య విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పలు సందర్భాల్లో రోశయ్య తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.

రోశయ్యకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
రోశయ్యకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్యకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆర్యవైశ్య ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ లో ఏదైనా మంచి ప్రదేశాన్ని గుర్తిస్తే అక్కడ రోశయ్య విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగో వర్ధంతిలోపు విగ్రహ ఏర్పాటు జరగాలని ఆకాంక్షించారు.

yearly horoscope entry point

రోశయ్య వర్ధంతి కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. శాసనమండలి, శాసనసభలో పోటీ పడి స్పీచ్ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోశయ్య ఇచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లనే 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడిందన్నారు.

ఛాంబర్ కు పిలిపించారు…

“చుక్క రామయ్య,ప్రొఫెసర్ నాగేశ్వర్, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీ గా మాట్లాడేందుకు నేను భయపడ్డాను. నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్ కు పిలిపించుకొని ప్రోత్సహించారు. ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికి మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రశ్నించాలి. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు” అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయన్నారు. “రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదు. సీఎంగా, గవర్నర్ గా,వివిధ హోదా ల్లో 50 యేళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారు. తమిళనాడు గవర్నర్ గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు..కాని రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు. అనాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజం లా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు. రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు. ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

విగ్రహం ఏర్పాటు చేస్తాం - సీఎం రేవంత్

నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయపడలేదు. రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయి. సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారు. రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం. నేను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం” అని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం