Pushpa 2 Review: పుష్ప 2 రివ్యూ - పుష్ప‌రాజ్‌ మాస్ జాత‌ర - అల్లు అర్జున్ సీక్వెల్ మూవీ ఎలా ఉందంటే?-allu arjun pushpa 2 review pushpa the rule movie plus and minus points rashmika mandanna sukumar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Review: పుష్ప 2 రివ్యూ - పుష్ప‌రాజ్‌ మాస్ జాత‌ర - అల్లు అర్జున్ సీక్వెల్ మూవీ ఎలా ఉందంటే?

Pushpa 2 Review: పుష్ప 2 రివ్యూ - పుష్ప‌రాజ్‌ మాస్ జాత‌ర - అల్లు అర్జున్ సీక్వెల్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Dec 05, 2024 09:30 AM IST

Pushpa 2 Movie Review: పుష్ప 2 మేనియాతో పాన్ ఇండియా షేక్ అవుతోంది. రివ్యూల కోసం అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప ది రూల్‌ రిలీజ్‌కు ముందే ప‌లు బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. పుష్ప 2 మూవీ పూర్తి రివ్యూ ఇక్కడ చదవండి.

పుష్ప 2 రివ్యూ
పుష్ప 2 రివ్యూ

Pushpa 2 Review: ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఎక్క‌డ చూసిన పుష్ప 2 క్రేజ్ క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఈ రేంజ్‌లో హైప్ తెచ్చుకున్న సినిమా మ‌రోటి లేదు. పుష్ప బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌తో సీక్వెల్ కోసం దాదాపు మూడేళ్లుగా దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృత‌గా ఎదురుచూస్తోన్నారు. ఇదంతా పుష్ప‌రాజ్ క్యారెక్ట‌ర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌గా చెప్ప‌వ‌చ్చు. పుష్ప‌రాజ్ పాత్ర‌లో అల్లు అర్జున్ మ్యాన‌రిజ‌మ్స్‌, డైలాగ్స్ మాస్ క్లాస్, యూత్ అనే తేడాలు లేకుండా అంద‌రికి ఎక్కేశాయి.

ప‌న్నెండు వేల‌కుపైగా స్క్రీన్స్‌లో సినిమా రిలీజ్ కావ‌డం, అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే వంద కోట్లు దాట‌డం.. ఇలా రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డుల‌తో పుష్ప 2పై అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి. దాదాపు వెయ్యి కోట్ల టార్గెట్‌తో పుష్ప ది రూల్ బాక్సాఫీస్‌ బ‌రిలోకి దిగుతోంది.

హీరోహీరోయిన్లు అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు డైరెక్ట‌ర్ సుకుమార్‌ మూడేళ్ల క‌ష్టానికి ప్ర‌తిఫ‌లంగా వ‌చ్చిన పుష్ప 2 రిలీజ్‌కు ఓ రోజు ముందే ప్రీమియ‌ర్స్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పుష్ప 2 ఎలా ఉంది? పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ ఏ రేంజ్‌లో చెల‌రేగిపోయాడు? సీక్వెల్ నిజంగానే బాక్సాఫీస్‌నుషేక్ చేసిందా? లేదా అంటే?

పుష్ప‌రాజ్‌... నేష‌న‌ల్ కాదు ఇంట‌ర్నేష‌న‌ల్‌...

పుష్ప‌రాజ్ (అల్లు అర్జున్‌) ఎర్ర‌చంద‌నం సిండికేట్ సామ్రాజ్యానికి తిరుగులేని నాయ‌కుడిగా మార‌తాడు. త‌న‌కంటూ సొంతంగా ఓ పెద్ద‌ సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుంటాడు. మరోవైపు త‌న‌ను అవ‌మానించిన పుష్ప‌పై ప‌గ‌తో ర‌గిలిపోతుంటాడు ఎస్‌పి భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ (ఫ‌హాద్ ఫాజిల్‌. పుష్ప చేస్తున్న ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణాను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తూ ప్ర‌తిసారి ఓడిపోతుంటాడు.

సీఎంతో పుష్ప ఓ ఫొటో దిగితే చూడాల‌ని శ్రీవ‌ల్లి (ర‌ష్మిక మంద‌న్న‌) ఆశ‌ప‌డుతుంది. కానీ సీఏం మాత్రం పుష్ప‌రాజ్‌ను స్మ‌గ్ల‌ర్ అంటూ చుల‌క‌న‌గా మాట్లాడుతూ అత‌డితో ఫొటో దిగ‌డానికి నిరాక‌రిస్తాడు. దాంతో సీఎంను దించేసి ఆ ప‌ద‌విలో సిద్ధ‌ప్ప‌ (రావు ర‌మేష్‌)ను కూర్చోపెట్టాల‌ని పుష్ప నిర్ణ‌యించుకుంటాడు. అందుకోసం డ‌బ్బు భారీగా అవ‌స‌రం కావ‌డంతో ఓ విదేశీయుడితో 5 వేల కోట్ల భారీ డీల్ కుద‌ర్చుకుంటాడు. తాను విదేశాల‌కు త‌ర‌లిస్తున్న ఎర్ర‌చంద‌నాన్ని ప‌ట్టుకుంటే తిరిగి కూలీవాడిగా మారుతాన‌ని భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌తోనే పుష్ప ఛాలెంజ్ చేస్తాడు? ఆ త‌ర్వాత ఏమైంది?

ఈ ఛాలెంజ్‌లో పుష్ప నెగ్గాడా? పుష్ప డీల్‌ను అడ్డుకోవ‌డానికి భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ ఏం చేశాడు? అత‌డిని పుష్ప ఏ విధంగా బోల్తా కొట్టించాడు? త‌న‌కు ఇంటి పేరు ఉండాల‌నే పుష్ప క‌ల ఎలా సాకార‌మైంది? త‌న అన్న కూతురును ర‌క్షించ‌డం కోసం ఏకంగా సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ ప్ర‌తాప రెడ్డితోనే (జ‌గ‌ప‌తిబాబు) పుష్ప ఎందుకు వైరం పెట్టుకున్నాడు? అన్న‌దే పుష్ప 2 క‌థ‌.

పుష్ప 2 ఎలివేష‌న్స్‌.. బిల్డ‌ప్ షాట్స్‌

కూలీగా జీవితాన్ని మొద‌లుపెట్టి సిండికేట్ నాయ‌కుడిగా పుష్ప‌రాజ్ ఎలా ఎదిగాడ‌న్న‌ది పుష్ప పార్ట్ 1లో చూపించాడు డైరెక్ట‌ర్‌ సుకుమార్‌. పుష్ప‌రాజ్ స్ట్ర‌గుల్స్‌, సంఘ‌ర్ష‌ణను ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ మిక్స్ చేస్తూ మొద‌టిభాగంలో ప్ర‌జెంట్ చేశారు. పుష్ప 2 మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ మూవీలా న‌డిపించారు సుకుమార్‌.

సిండికేట్ నాయ‌కుడిగా మారిన త‌ర్వాత పుష్ప‌రాజ్‌కు ఎదురైన స‌వాళ్లు.... నేష‌న‌ల్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌కు త‌న సామ్రాజ్యాన్ని ఎలా విస్తారించాడ‌న్న‌ది చూపిస్తూ సీక్వెల్ క‌థ‌ను రాసుకున్నారు. సీక్వెల్‌లో పుష్ప‌రాజ్ జ‌ర్నీ మొత్తం ఎలివేష‌న్స్‌, బిల్డ‌ప్ షాట్స్‌తో నింపేశారు. బ‌న్నీ హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించారు

సుక్కు మార్క్‌...

కేవ‌లం మాస్ అంశాల‌కే క‌థ‌ను ప‌రిమితం చేయ‌కుండా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు సీక్వెల్‌లో చోటిచ్చారు సుకుమార్‌. శ్రీవ‌ల్లి పుష్ప‌రాజ్ జంట యూత్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. పీలింగ్స్‌ అంటూ రొమాన్స్‌ను చూపిస్తూనే భ‌ర్త‌కు జాత‌ర‌లో అవ‌మానం జ‌రిగితే శ్రీవ‌ల్లి ఫైర్ అయ్యే ఎపిసోడ్‌లో సుక్కు త‌న మార్క్‌ను చూపించారు. తాను చేసిన త‌ప్పును ఒప్పుకొని పుష్ప‌ను త‌న త‌మ్ముడిగా అజ‌య్ ఒప్పుకునే సీన్స్‌తో హైలైట్‌గా నిలుస్తాయి.

క‌థ‌నంతోనే పుష్ప 2 మ్యాజిక్‌

పుష్ప 2లో క‌థ కంటే క‌థ‌నంతోనే ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ఎక్కువ‌గా మ్యాజిక్ చేశారు. పుష్ప‌, భ‌న్వ‌ర్‌ సింగ్ షెక‌వాత్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్‌ ద్వారా యాక్ష‌న్‌తో పాటు అంత‌ర్లీనంగా సిట్యువేష‌న‌ల్ కామెడీని రాబ‌ట్టుకోవ‌డం బాగుంది. భ‌న్వ‌ర్‌ సింగ్ వేసే ఎత్తుల‌ను పుష్ప తిప్పికొట్టే సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయి.

క్యారెక్ట‌ర్ ఎలివేట్ సీన్స్‌

పుష్ప 2 ఫ‌స్ట్ హాఫ్‌లో క‌థ కంటే పుష్ప క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసే సీన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. జ‌పాన్ షిఫ్ హార్బ‌ర్‌లో బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే ఎంట్రీ సీన్స్‌తోనే పుష్ప 2 రేంజ్ ఏంటో హింట్ ఇచ్చేశాడు. ఓ వైపు పుష్ఫ శ్రీవ‌ల్లి అనుబంధం, మ‌రోవైపు పుష్ప‌రాజ్‌కు, భ‌న్వ‌ర్ సింగ్ షెక‌వాత్ మ‌ధ్య గొడ‌వ‌ల చుట్టూ ఫ‌స్ట్ హాఫ్‌ను న‌డిపించారు.

సారీ చెబుతానంటూ భ‌న్వ‌ర్‌సింగ్‌ను పుష్ప దారుణంగా అవ‌మానించే సీన్‌తోనే సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్‌. ఈ పోటీలో పుష్ప ఎలా గెలిచాడ‌నే అంశాల చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. గంగ‌ల‌మ్మ జాత‌ర ఎపిసోడ్‌, అన్న కూతురిని కాపాడ‌టం కోసం పుష్ప చేసే క్లైమాక్స్ ఫైట్ ఫ్యాన్స్‌కు హై మూమెంట్‌ను ఇస్తాయి.

మీ బాస్‌కు నేనే బాస్‌...

ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ సోష‌ల్ మీడియాలో బ‌న్నీపై వ‌చ్చే ట్రోల్స్‌ను ఉద్దేశించి రాసిన‌ట్లుగానే అనిపిస్తాయి. మీ బాస్‌కు కూడా నేను బాస్‌ను, ఒక‌డు ఎదుగుతుంటే చూడ‌లేక వాడు డౌన్ కావాల‌ని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. ఎత్తులో ఉన్న‌ప్పుడు ఈగోలు ఉండ‌కూడ‌దు అనే డైలాగ్స్ కావాల‌నే రాసిన‌ట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీకి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ నేపథ్యంలో ఈ డైలాగులు ఆలోచింపజేస్తాయి.

సాంగ్స్ ప్లేస్‌మెంట్ క‌రెక్ట్ లేదు

సినిమాలో సూసేకి, ఫీలింగ్స్ సాంగ్స్ ప్లేస్‌మెంట్ క‌రెక్ట్ లేదు. కావాల‌నే ఈ పాట‌ల్ని క‌థ‌లో ఇరికించిన‌ట్లుగా అనిపిస్తుంది. ఎలివేష‌న్ సీన్స్ ఎక్కువైపోవ‌డంతో సినిమా లెంగ్త్ పెరిగిన ఫీలింగ్ క‌లుగుతుంది. పుష్ప‌రాజ్‌, భ‌న్వ‌ర్‌సింగ్ ఒక‌రిపై మ‌రొక‌రు వేసుకునే ఎత్తులు పై ఎత్తులు చాలా వ‌ర‌కు లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. ఫ‌హాద్ ఫాజిల్ క్యారెక్ట‌ర్‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు సుకుమార్‌. అర్ధాంత‌రంగా క్యారెక్ట‌ర్‌ను ముగించ‌డం బాగాలేదు.

పుష్ప 2 ఫుల్ మాసీ...

పుష్ప‌రాజ్ పాత్ర‌లో అల్లు అర్జున్ మ‌రోసారి ఇరగదీశాడు. ఫ‌స్ట్ పార్ట్‌కు మించి మాసీగా సీక్వెల్‌లో అత‌డి క్యారెక్ట‌ర్ సాగింది. గంగాల‌మ్మ గెట‌ప్‌లో అల్లు అర్జున్ న‌ట‌న బాగుంది. యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లో అద‌గొట్టాడు.

శ్రీవ‌ల్లిగా ర‌ష్మిక మంద‌న్న త‌న న‌ట‌న‌తో మెప్పించింది. మెచ్యూర్డ్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచింది. ఫ‌హాద్ ఫాజిల్ క‌మెడియ‌న్‌కు త‌క్కువ‌...విల‌న్‌కు ఎక్కువ అన్న‌ట్లుగా సినిమాలో క‌నిపించాడు. రావుర‌మేష్‌, జ‌గ‌ప‌తిబాబు త‌మ అనుభ‌వంతో పాత్ర‌ల‌కు ప్రాణంపోశారు. సునీల్‌, అన‌సూయ పాత్రల ఇంపాక్ట్ పెద్ద‌గా సీక్వెల్ లో క‌నిపించ‌లేదు. స‌త్య ఓ సీన్‌లో మెరిశాడు. కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్సులు ఆకట్టుకుంటాయి.

దేవిశ్రీప్ర‌సాద్ పాట‌ల్లో టైటిల్ సాంగ్ బాగుంది. సామ్ సీఎస్ బీజీఎమ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది.

విజువ‌ల్ ఫీస్ట్…

పుష్ప 2 అల్లు అర్జున్‌ అభిమానుల‌కు విజువ‌ల్ ఫీస్ట్‌గా నిలిచే క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ మూవీ. పుష్ప‌రాజ్ పాత్ర‌లో అల్లు అర్జున్ మ‌రోసారి అద‌ర‌గొట్టేశాడు. అత‌డి యాక్టింగ్‌తో పాటు యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, ఎలివేష‌న్స్ కోసం పుష్ప 2 సినిమాను చూడొచ్చు.

పుష్ప 2 మూవీ రేటింగ్‌: 3/5

Whats_app_banner