Bhadrachalam : భద్రాద్రి రామయ్యకు సేవ చేసే భాగ్యం.. ఎవరికి దక్కుతుందో!
Bhadrachalam : ఎట్టకేలకు భద్రాచలం రామాలయం నూతన బోర్డు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. త్వరలోనే కొత్త బోర్డు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఆశావహులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి రామయ్యకు సేవ చేసే అదృష్టం వరిస్తుందో చూడాలి.
భద్రాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవీ కాలం పూర్తయ్యి 12 ఏళ్లు కావోస్తుంది. 2012 నుంచి ఇప్పటివరకు బోర్డును నియమించలేదు. ఈ నేపథ్యంలో.. పుష్కర కాలం తర్వాత.. నూతన బోర్డు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈనెల 11న దేవాదాయశాఖ ఇచ్చిన ప్రకటనతో ఆశావహుల్లో నూతనోత్సాహం నెలకొంది.
1968లో భద్రాచలం తొలి ధర్మకర్తల మండలి ఏర్పడింది. అప్పటి నుంచి 13 విడతలుగా కమిటీలు పాలన సాగించాయి. ఆఖరిగా 2010 నవంబరు 26 నుంచి 2012 నవంబరు 25 వరకు రెండేళ్లపాటు కొనసాగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చినా ఎవరికీ దేవుడి సేవ చేసే భాగ్యం దక్కలేదు. తాజాగా కొత్త బోర్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
భద్రాచలం ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డులకు ప్రత్యేక గౌరవ మర్యాదలు ఉంటాయి. ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌కు ఇచ్చే ప్రొటోకాల్ విశేష స్థాయిలో ఉంటుంది. దీంతో దీన్ని దక్కించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఒక్కసారైనా ఈ హోదా దక్కించుకునేందుకు పైరవీలు సాగిస్తున్నారు.
గత బోర్డులో ఛైర్మన్ కాకుండా తొమ్మిది మంది సభ్యులు పనిచేశారు. అధ్యక్ష పదవి రాకపోతే.. కనీసం సభ్యుడి పోస్టు అయినా వస్తుందనే నమ్మకంతో కొందరు రాజధానిలోనే మకాం వేశారు. తెలంగాణ ఉద్యమం, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో తాము చేసిన సేవల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరో 13 ఆలయాలకు పచ్చజెండా..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 13 ఆలయాలకు నూతన పాలకవర్గాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మంలోని కమాన్‌బజార్ శ్రీవేంకటేశ్వరస్వామి, రెడ్డిపల్లిలోని శ్రీమారెమ్మ, కాల్వొడ్డు శ్రీసత్యనారాయణ సహిత వీరాంజనేయస్వామి, స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి, కందుకూరు శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీనీలాద్రి స్వామి, మధిర శ్రీమృత్యుంజయస్వామి ఆలయాలకు నూతన పాలక వర్గాలు ఏర్పాటు కానున్నాయి.
అలాగే.. తీర్థాల శ్రీసంగమేశ్వర, గార్లొడ్డు శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఊసిరికాయలపల్లి శ్రీకోట మైసమ్మ, ఇందిరానగర్ శ్రీసీతారామస్వామి, అన్నపురెడ్డిపల్లి శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి, కొత్తగూడెంలోని శ్రీవిజయ విఘ్నేశ్వరస్వామి ఆలయాల కమిటీల నియామకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రెండు రోజుల కిందట భద్రాచలం రామాలయం, పాల్వంచలోని పెద్దమ్మ గుడి, ఎర్రుపాలెం మండలం జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయాల పాలకమండళ్ల ఏర్పాటుకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.