Adilabad : ఏజెన్సీ అడ్డాగా అంతర పంటలు - ఆగని 'గంజాయి' దందా!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు జోరుగా సాగుతుంది. ఇందుకు సంబంధించి పక్కా సమాచారం అందటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఏజెన్సీ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. నిందితులను కటకటాల్లోకి పంపుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజా యి సాగు జోరుగా సాగుతుంది. రవాణ సౌకర్యం లేని ప్రాంతాల్లో, అటవీ పరిసర ప్రాంతాల్లో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలో జిల్లా పోలీసులు అప్రమత్తయ్యారు. పక్కా సమాచారంతో గంజాయి క్షేత్రాలపై దాడులు చేపట్టారు. ఇంటెలిజెన్సీ నిఘా నివేదిక ప్రకారం… ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో నేరుగా పోలీసులే రంగంలోకి దిగారు. విస్తృతంగా దాడులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే… చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
మావోయిస్టుల ఉనికి ప్రాంతాల్లో సాగు....!
కడెం, పెంబి దస్తురాబాద్ పరిధిలోని మారుమూల గిరిజన గూడాల్లో గంజాయి సాగు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు దాడుల్లో తేలింది. దట్టమైన అడవిగా పేరు గాంచిన అల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో కొందరు పోడు వ్యవసాయం చేస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఏరియాగా కూడా గుర్తింపు పొందింది. అయితే ఇక్కడ నివాసం ఉంటున్న కొందరు… గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కంది పంటను పోలి ఉండే గంజాయి మొలకల ద్వారా దందాను కొనసాగిస్తున్నారు.
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు...
నిర్మల్ జిల్లా ఎస్సీ జానకి శర్మల ఆధ్వర్యంలో స్వయంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. అల్లంపల్లి అటవీ పరిధిలోని మంగల్ సింగ్ తాండ, బాబా నాయక్ తండా మధ్య ఉన్న దట్టమైన అడవుల్లో తనిఖీలు చేపట్టారు. ఇక్కడ అంతు చిక్కని రీతిలో పోలీసులకు 70 లక్షలకు పైగా విలువైన గంజాయి పట్టుబడింది. ప్రధాన సూత్రదారులను ఆరుగురిని అరెస్టుచేశారు. గత ఏడాది కడెం మండలం ఇస్లాంపూర్ ప్రాంతంలో భారీ ఎత్తున పంట సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు.
గంజాయి సాగు పెద్దు ఎత్తున ఉన్నప్పటికీ అబ్కారీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మొక్కుబడిగా కొన్నిచోట్ల సోదాలు చేస్తూ… నిందితులను అరెస్టు చేసిచేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గంజాయికి బానిస అవుతూ యువత పక్కదారే పట్టే అవకాశాలు ఉన్నాయని… ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గంజాయి సాగుతో పాటు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. ఇటీవలే పలుచోట్ల జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. యువతను పెడదోవ పట్టకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.