Paneer methi Masala: పనీర్ మెంతి మసాలా కూర రెసిపీ, ఇలా వండితే వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది-paneer methi masala curry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Methi Masala: పనీర్ మెంతి మసాలా కూర రెసిపీ, ఇలా వండితే వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది

Paneer methi Masala: పనీర్ మెంతి మసాలా కూర రెసిపీ, ఇలా వండితే వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 04, 2024 05:30 PM IST

Paneer methi Masala: చలికాలంలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని తినాలి. ఇక్కడ మేము రోగనిరోధక శక్తిని పెంచే పనీర్ మెంతి మసాలా కూర రెసిపీ ఇచ్చాము.

పనీర్ మెంతి మసాలా కర్రీ
పనీర్ మెంతి మసాలా కర్రీ

చలికాలంలో మీరు తినే ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఈ కాలంలోనే త్వరగా జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఫీవర్లు వంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి బలాన్ని ఇచ్చే ఆహారాలను తినాలి. ఇక్కడ మేము పనీర్ మెంతి మసాలా కూర రెసిపీ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. మెంతికూర, పనీర్ ముక్కలతో వండే కూర కుటుంబం మొత్తానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పైగా ఇందులో ఉండే ఎన్నో పోషకాలు మన శరీరానికి బలాన్ని, శక్తిని అందిస్తాయి. ఇక పనీర్ మెంతి మసాలా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పనీర్ మెంతి మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు

నూనె - మూడు స్పూన్లు

మెంతి ఆకులు తరుగు - ఒకటిన్నర కప్పు

పనీర్ ముక్కలు - ఒక కప్పు

పచ్చిమిర్చి - రెండు

యాలకులు - ఒకటి

దాల్చిన చెక్క - చిన్న ముక్క

జీలకర్ర - అర స్పూను

ఉల్లిపాయలు తరుగు - ఒక కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

టమోటో - రెండు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పెరుగు - పావు కప్పు

కాశ్మీరీ కారం - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

సాధారణ కారం - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

గరం మసాలా - పావు స్పూను

చాట్ మసాలా - పావు స్పూను

పనీర్ మెంతి మసాలా కూర రెసిపీ

1. మెంతి ఆకులను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. అలాగే పనీర్ ముక్కలను మీకు కావాల్సిన పరిమాణంలో కట్ చేసి పక్కన పెట్టుకోండి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను ఆయిల్ వేయండి.

4. నూనెలో మెంతి ఆకులను వేసి ఐదు నిమిషాలు పాటు చిన్న మంట మీద వేయించండి.

5. అలా వేయించాక వాటిని తీసి పక్కన పెట్టుకోండి.

6. ఇప్పుడు అదే కళాయిలో పచ్చిమిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, కాశ్మీరీ కారం వంటివన్నీ వేసి కలుపుకోండి. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోండి.

7. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా కలపండి.

8. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా వేయించండి.

9. ఇప్పుడు అందులో టమోటో ప్యూరిని వేసి మూడు నిమిషాల పాటు ఉడికించండి.

10. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పొడిని అందులో వేసి బాగా కలపండి.

11. చిన్న మంట మీద ఉడికిస్తే ఇది ఇగురులాగా దగ్గరగా ఉడుకుతుంది.

12. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి ఆకును, పనీరు ముక్కలను వేసి బాగా కలపండి.

13. రుచికి సరిపడా ఉప్పును వేయండి. ఇది ఇగురు లాగా ఉడకడానికి ఒక కప్పు వేడి నీటిని వేసి బాగా కలపండి.

14. పది నిమిషాలు పాటు దీన్ని అలా ఉడకనివ్వండి.

15. ఆ తర్వాత ఇది ఇగురు లాగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే పనీర్ మెంతి మసాలా కూర రెడీ అయినట్టే.

వేడి వేడి అన్నంలో ఈ పనీర్ మెంతి మసాలా కూర కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఇందులో పనీర్ ముక్కలను చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.

పనీర్, మెంతులు... ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. దీనిలో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. పనీర్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి శాఖాహారులు కచ్చితంగా తినాల్సిన వాటిలో పనీరు ఒకటి. ఇక మెంతాకులో ఉండే పోషకాలు ఇన్నీ అన్నీ కావు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనారోగ్యాలతో తట్టుకోవాలంటే మెంతి ఆకులను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. ఈ పనీర్ మెంతి మసాలా కూర వండడం చాలా సులభం. ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే దీని రుచి తెలుస్తుంది.

Whats_app_banner