Broccoli paneer recipe: బరువు తగ్గించే బ్రకోలీ పనీర్ రెసిపీ, రోజుకో కప్పు తినండి చాలు-broccoli paneer recipe in telugu know how to make this weightloss recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Broccoli Paneer Recipe: బరువు తగ్గించే బ్రకోలీ పనీర్ రెసిపీ, రోజుకో కప్పు తినండి చాలు

Broccoli paneer recipe: బరువు తగ్గించే బ్రకోలీ పనీర్ రెసిపీ, రోజుకో కప్పు తినండి చాలు

Haritha Chappa HT Telugu
Nov 21, 2024 03:30 PM IST

Broccoli paneer recipe: అధిక బరువు తగ్గాలనుకునేవారు ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. ప్రతిరోజూ ఒక కప్పు బ్రకోలీ పనీర్ రెసిపీ తినేందుకు ప్రయత్నించండి. ఇతర ఆహారాలను తగ్గించి బరువు తగ్గుతారు.

బ్రకోలీ పనీర్ రెసిపీలు
బ్రకోలీ పనీర్ రెసిపీలు

బరువు తగ్గడానికి కొన్ని రకాల ప్రత్యేకమైన ఆహారాలను డైటీషియన్లు సూచిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో బ్రకోలీ పనీర్ రెసిపీ ఒకటి ఇది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తింటే ఆ రోజంతా ఆహారాలు తినాలన్నా కోరిక తగ్గిపోతుంది. ఆకలి కూడా వేయదు. మధ్యాహ్నం తిన్నా కూడా రాత్రిపూట భోజనం తినాలన్న ఆసక్తి తగ్గుతుంది. ఈ బ్రకోలీ పనీర్ రెసిపీ చేయడం కూడా చాలా సులువు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఒక కప్పు తినండి. ఇతర ఆహారాలను తినడం తగ్గిస్తారు. పైగా దీనిలో అన్నం కలుపుకుని తినాల్సిన అవసరం లేదు. కేవలం స్పూన్‌తో కొంచెం కొంచెంగా తీసుకొని తినేస్తే సరిపోతుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

బ్రకోలీ పనీర్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బ్రకోలి ముక్కలు - ఒక కప్పు

పనీర్ ముక్కలు - అరకప్పు

నువ్వులు - ఒక స్పూను

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాల పొడి - అర స్పూను

ఉల్లిపాయ - ఒకటి

అల్లం తరుగు - ఒక స్పూన్

బ్రకోలీ పనీర్ రెసిపీ

1. బ్రకోలిని ముక్కలుగా కట్ చేసే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బటర్ వేయండి. వాటిని తీసి పక్కన పెట్టుకోండి.

3. ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం బటర్ వేసి నువ్వులు, ఉల్లిపాయలు తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి బాగా వేయించుకోండి.

4. అది బాగా వేగాక బ్రకోలి ముక్కలను వేసి వేయించండి.

5. బ్రకోలీ బాగా వేయించిన పనీర్‌ను వేసి బాగా కలుపుకోండి.

6. పైన రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కూడా చల్లుకొని ఐదు నుంచి పది నిమిషాలు ఫ్రై చేయండి.

7. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే కప్పులో వేసుకొని తిని చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పైగా మీకు ఆకలి కూడా వేయదు.

పనీర్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి మీకు ఆకలి తగ్గుతుంది. పనీరు తినడం వల్ల శరీరానికి శక్తి కూడా అందుతుంది. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా. శాఖాహారులకు పనీర్ తినడం వల్ల కావలసినంత ప్రోటీన్ శరీరానికి చేరుతుంది. ఇక బ్రోకోలి సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటారు. బ్రోకోని తినడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. బ్రకోలిని ఆహారం చేర్చుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఒకసారి ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.

Whats_app_banner