Mushroom Biryani: మిరియాలు వేసి చేసే మష్రూమ్ బిర్యాని చలికాలంలో వేడివేడిగా తింటే ఆ రుచే వేరు
Mushroom Biryani: పుట్టగొడుగులు అంటే ఎంతో మందికి నచ్చుతాయి. దీంతో చేసే వంటకాలు నాన్ వెజ్ కూరల్లా ఉంటాయి. అందుకే మాంసాహారులకు పుట్టగొడుగులు కూడా నచ్చుతాయి. ఇక్కడ మేము మష్రూమ్ బిర్యాని రెసిపీ ఇచ్చాము .
చలికాలం వానాకాలంలోనే ఎక్కువగా పుట్టగొడుగులు దొరుకుతూ ఉంటాయి. ఇందులో అన్నీ తినదగినవి కాదు, కొన్ని మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి పుట్టగొడుగులు మార్కెట్లో అధికంగానే లభిస్తాయి. వీటితో ఒకసారి పెప్పర్ మష్రూమ్ బిర్యాని చేసి చూడండి. మిరియాల పొడి వేసి చేసే ఈ బిర్యాని రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా చలికాలంలో దీన్ని వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు. పైగా రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కూడా దీనికి ఉంది. మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకోండి.
మిరియాలు మష్రూమ్ బిర్యాని రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు
టమోటోలు - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూను
బటన్ మష్రూమ్స్ - 200 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - నాలుగు స్పూన్లు
లవంగాలు - రెండు
ధనియాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
నల్ల మిరియాలు - అర స్పూను
దాల్చిన చెక్క - చిన్న ముక్క
సోంపు - ఒక స్పూను
యాలకులు - రెండు
బిర్యానీ ఆకులు - రెండు
పసుపు - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఇంగువ - చిటికెడు
పెప్పర్ మష్రూమ్ బిర్యాని రెసిపీ
1. బాస్మతీ బియ్యాన్ని అరగంట ముందే నీళ్లలో వేసి నానబెట్టాలి.
2. బటన్ మష్రూమ్‌లను శుభ్రంగా కడిగి మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బిర్యానీ మసాలా పౌడర్ ని తయారు చేసుకోవాలి.
4. ఇందుకోసం కళాయిలో లవంగాలు, ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, సోంపు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.
5. వాటిని మిక్సీలో వేసి అందులో కారం, పసుపు, ఇంగువ కూడా వేసి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద బిర్యాని వండేందుకు పెద్ద పాత్రను పెట్టాలి. అందులో నూనె వేయాలి.
7. అల్లం, వెల్లుల్లి తరుగును వేసి వేయించుకోవాలి.
8. తర్వాత సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి.
9. ఆ తర్వాత పచ్చిమిర్చిని నిలువుగా కోసి వేయించుకోవాలి.
10. టమాటోలను నిలువుగా కోసి అవి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
11. ఇప్పుడు పుట్టగొడుగులను అందులో వేసి వేయించాలి.
12. మూడు నిమిషాల పాటు ఈ మొత్తం మిశ్రమాన్ని వేయించాలి.
13. పుట్టగొడుగులు దగ్గరగా ఉడికే వరకు ఉంచాలి.
14. తర్వాత ముందుగా చేసుకున్న బిర్యాని మసాలా పొడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
15. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి.
16. ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం అందులో వేసి బాగా కలపాలి.
17. ఆ బియ్యం ఉడకడానికి సరిపడా మూడు కప్పులు నీటిని వేసి కలుపుకోవాలి.
18. చివరగా నిమ్మరసం కూడా పిండి పైన మూత పెట్టాలి.
19. అరగంట పాటు చిన్న మంట మీద ఉంచితే బిర్యాని చక్కగా ఉడికేస్తుంది. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
అంతే టేస్టీ పేపర్ మష్రూమ్ బిర్యాని రెడీ అయినట్టే. చలికాలంలో ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడివేడిగా తింటే రుచి అదిరిపోతుంది.
పుట్టగొడుగులు తినడం వల్ల మనకి విటమిన్ డి అందుతుంది. కాబట్టి అప్పుడప్పుడు పుట్టగొడుగులను తినాల్సిన అవసరం ఉంది. అలాగే దీనిలో మనం ఆరోగ్యానికి మేలు చేసే కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, టమోటాలు వంటివి వాడాము. కాబట్టి ఇది అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒకసారి దీన్ని ప్రయత్నించి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.