Mutton Biryani: నోరూరించే మటన్ అంబూర్ బిర్యానీ, తింటే మరిచిపోలేరు, రెసిపీ ఇదిగోండి
Mutton Biryani: దమ్ బిర్యానీకి పోటీ ఇచ్చేంత రుచిగా ఉంటుంది అంబూర్ బిర్యానీ. ఇది తమిళనాడుకు చెందిన బిర్యానీ. అంబూర్ బిర్యానీ సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
బిర్యానీ పేరు చెప్తేనే నోరూరిపోతుంది. అందులో స్పెషల్ బిర్యానీ అంబూర్ బిర్యానీ. ఇది తమిళనాడుకు చెందిన ప్రత్యేకమైన వంటకం. దీని వెనుక గొప్ప చరిత్ర కూడా ఉంది. హైదరాబాదీ దమ్ బిర్యాని ఎంత టేస్టుగా ఉంటుందో అంబూర్ బిర్యాని కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇది అంబూరు పట్టణంలో పుట్టింది. దక్షిణ భారత వంటకాలలో ప్రాముఖ్యతను సంతరించుకున్న వాటిలో ఈ అంబుర్ బిర్యాని కూడా ఒకటి. అందరూ బిర్యాని చేయడం కష్టం అనుకుంటారు. నిజానికి దీన్ని చాలా సులువుగా ఇంట్లోనే వండేయచ్చు. ఎలా చేయాలో తెలుసుకోండి.
అంబుర్ బిర్యాని రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి రైస్ - ఒక కిలో
మటన్ - అరకిలో
నెయ్యి - రెండు స్పూన్లు
నూనె - తగినంత
ఉల్లిపాయ - మూడు
టమోటోలు - మూడు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ఏలకులు - నాలుగు
కొత్తిమీర తరుగు - ఐదు స్పూన్లు
లవంగాలు - నాలుగు
పుదీనా తరుగు - అరకప్పు
పచ్చిమిర్చి - రెండు
ఎండుమిర్చి - పది
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
అంబూర్ బిర్యాని రెసిపీ
1. అంబూర్ బిర్యాని చేయడానికి ముందుగా ఎర్ర మిరపకాయలను నీటిలో నానబెట్టి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చిని కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
2. బాస్మతి రైస్ ను ముందుగానే అరగంట పాటు నానబెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో బాస్మతి రైస్ రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి అన్నం వండాలి.
4. ఎనభై శాతం అన్నం ఉడికాక నీళ్లు వంపేసి ఆ అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు లోతైన ఒక ఒక కుక్కర్ లేదా గిన్నెను స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
6. అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకోవాలి.
7. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, యాలకులు వేసి వేయించుకోవాలి.
8. అలాగే ఉల్లిపాయ తరుగును కూడా వేసి వేయించాలి.
9. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
10. అందులోనే మటన్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
11. పైన కొత్తిమీర తరుగు, ఉల్లిపాయల తరుగు, టమోటో తరుగు, పుదీనా తరుగును వేసి బాగా ఉడికించుకోవాలి.
12. ఇది ఉడుకుతున్నప్పుడే ముందుగా చేసి పెట్టుకున్న మిరపకాయల పేస్టును వేసి బాగా కలపాలి.
13. కాస్త ఉప్పును కూడా వేసుకోవాలి. ఇది ఇగురులాగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
14. తర్వాత మిగిలిన పెరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
15. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఈ మటన్ మిశ్రమంపై లేయర్ల లాగా వేసుకోవాలి.
16. అందులో మధ్య మధ్యలో కొత్తిమీర, పుదీనా తరుగును చల్లుకుంటూ ఉండాలి.
17. పైన మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా 20 నిమిషాలు పాటు చిన్న మంట మీద ఉడికించాలి.
18. అంతే టేస్టీ మటన్ అంబుర్ బిర్యాని రెడీ అయినట్టే.
మటన్ అంబూర్ బిర్యానీ రుచిలో అద్భుతంగా ఉంటుంది. దీనిలో మనం అదనంగా ఎండిమిర్చి పచ్చిమిర్చి కలిపిన పేస్టును వేస్తాము. ఇదే దీని స్పెషాలిటీ. అందుకే దీని రంగు కూడా కాస్త ఎరుపు గానే వస్తుంది. ఒకసారి వండుకొని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. దీనిలో కారం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎండుమిర్చిని, పచ్చిమిర్చిని కలిపి వేసిన మిశ్రమమే చాలా ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఇలా వండితే సరిపోతుంది. ఎప్పుడూ హైదరాబాద్ దమ్ బిర్యాని తిని బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా అంబూరు చికెన్ బిర్యాని చేసుకుని చూడండి మీకు నచ్చడం ఖాయం.