Pressure Cooker : ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం మంచిది కాదా? పోషకాలన్నీ నశిస్తాయా?
Pressure cooker: పప్పులు, కూరలు, రకరకాల వంటలు అన్నీ ప్రెజర్ కుక్కర్లో వండుతున్నాం. అయితే అలా వండితే పోషకాలు నష్టపోతామని వినే ఉంటారు. అదెంత వరకు నిజమో తెల్సుకోండి.

దాదాపుగా అందరి ఇళ్లలోనూ ప్రెషర్ కుక్కర్‌లు ఉంటాయి. అన్నంతోపాటు, కొన్ని రకాల కూరల్ని కూడా అంతా వీటిలో వండేందుకు అలవాటు పడ్డారు. తక్కువ సమయంలోనే వంట పూర్తయిపోతుండటంతో అంతా వీటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కుక్కర్‌లో ప్రెషర్ ఉండటం వల్ల చాలా అధిక ఉష్ణోగ్రతల వద్ద కూరగాయల్లాంటివి ఉడుకుతాయి. అయితే ఇలా అధిక ఉష్ణోగ్రతల్లో కూరలు వండటం వల్ల పోషకాలు చాలా నశించిపోతాయా? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అందులో నిజానిజాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం వండుకునే కూరగాయలు, ఆకుకూరలు, మాంసాలు... తదితరాల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. అయితే వంట చేయడం వల్ల వీటిలో కొన్ని తగ్గిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని పోషకాలు హీట్ సెన్సిటివ్‌గా ఉంటాయి. అంటే వేడి చేస్తే అవి తగ్గిపోతాయన్న మాట. ఫోలేట్, విటమిన్ సీ లాంటివి ఈ కోవకే చెందుతాయి. అయితే ఇవి ఎలా వేడి చేసినా తగ్గిపోతాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వేడి చేసినా, మామూలుగా వండుకుని తిన్నా కూడా ఇవి తగ్గిపోతాయి.
పప్పులు, చిరు ధాన్యాల్లాంటివి మామూలుగా ఉడకాలంటే చాలా ఎక్కువ సేపు పడుతుంది. అదే ప్రెషర్ కుక్కర్‌లో అయితే తక్కువ సమయంలోనే అవి చక్కగా ఉడికిపోతాయి. మనకు తేలికగా జీర్ణం అయ్యే రీతిలో అవి తయారవుతాయి. అందువల్ల మనకు అజీర్ణం సమస్యల్లాంటివి తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రొటీన్‌లు, పీచు పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆహారాల్లో ఉండే సూక్ష్మ పోషకాలు కూడా తేలికగా జీర్ణం అవుతాయి.
ప్రెజర్ కుక్కర్లోని ఉష్ణోగ్రతల దగ్గర ఆహారాల్లోని కొన్ని పోషకాలు దాదాపుగా ఐదు నుంచి పది శాతం వరకు కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే మామూలుగా వేయించడం లేదా ఉడికించడం వల్ల 25 నుంచి 60 శాతం వరకు పోషకాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉడికించడంతో పోలిస్తే ప్రెషర్ కుక్కర్లోనే పోషకాలు ఎక్కువగా నిలిచి ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. కుక్కరా? కడాయా? అని కాకుండా ఆకు కూరల్లాంటి వాటిని ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ వేడి మీద ఉంచకూడదని మనం గుర్తుంచుకోవాలి.
టాపిక్