Food Inspections in Adilabad : కొనసాగుతున్న 'ఆహారపు' తనిఖీలు - అయినా మారని వ్యాపారుల తీరు..!-food safety task force inspections in adilabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Food Inspections In Adilabad : కొనసాగుతున్న 'ఆహారపు' తనిఖీలు - అయినా మారని వ్యాపారుల తీరు..!

Food Inspections in Adilabad : కొనసాగుతున్న 'ఆహారపు' తనిఖీలు - అయినా మారని వ్యాపారుల తీరు..!

HT Telugu Desk HT Telugu
Nov 08, 2024 10:28 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆహారపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పలువురు వ్యాపారాలు.. నాణ్యత లేని ఆహారాలను విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవలే జిల్లాల్లో పలువురు అస్వస్థతకు కూడా గురయ్యారు. అయితే వీరిపై పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని వినియోగదారులు కోరుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఆహారపు అధికారుల తనిఖీలు
ఆదిలాబాద్ జిల్లాలో ఆహారపు అధికారుల తనిఖీలు (image source Twitter)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫుడ్ ఇన్స్పెక్షన్ లు కొనసాగుతున్నాయి, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ వ్యాపారుల్లో చలనం కనిపించడం లేదు. ఇవన్నీ మాములే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

స్థానికంగా రెగ్యూలర్ అధికారులు లేకపోవడంతో పాటు ఇంఛార్జ్ అధికారులు కేవలం నెలవారీగా వచ్చిపోతున్నారు. ఇదే క్రమంలో వ్యాపారుల నుంచి వసూళ్లపర్వం కూడా కొనసాగుతున్నట్లు వార్తలు బయటికి వస్తున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు… నాణ్యతలేని ఆహారాలను విక్రయిస్తూ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారు.

జిల్లాలో ఎక్కువ మంది గిరిజనులు, నిరక్ష్యరాసులు ఉన్నారు. దీనికితోడు పెద్దగా అవగాహన లేకపోవటాన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంటున్నారు. నాణ్యత లేకపోవటంతో పాటు కల్తీ ఆహారాలను విక్రయిస్తున్నారు. నాణ్యతలేని నూనెలను విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. ఆహార పదార్థాల తనిఖీలు చేసే అధికారులు తగినంత మంది లేకపోవడం కూడా వ్యాపారులకు అవకాశంగా మారింది. వినియోగదారులు ఫిర్యాదు చేయాలనుకున్నప్పటికీ… ఎక్కడ ఫిర్యాదు చేయాలనే విషయాలపై అవగాహన ఉండటం లేదు. మరోవైపు మున్సిపాలిటీ అధికారులు కూడా ఈ విషయంలో చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు అందితే నామమాత్రపు తనిఖీలు చేసి.. కొద్దిపాటి జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు.

నిర్మల్ జిల్లాలో కలకలం...

చికెన్ బిర్యానీ తిని యువతి మృతి చెందిన విషయం నిర్మల్ లోని గ్రిల్ రెస్టారెంట్లో వెలుగు చూసింది. ఈ విషయం బయటికి రావటంతో అప్పటికప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ లు అక్కడికి చేరుకొని హోటల్ ను సీజ్ చేసారు. చికెన్ ఐటమ్స్ లో మయోనైజ్ వేసుకుని తినడం వల్లే యువతి మరణించిందని.. గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా మయోనైజ్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని రెస్టారెంట్లలో దీన్ని వాడుతుండటం గమనార్హం…!

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో గత వారం ఓ మండి హోటల్లో మాంస ఆహారం తిని కొందరు అస్వస్థతకు గురయ్యారు. అదేవిధంగా ఆసిఫాబాద్ లోని జనకాపూర్ లోని ఓ స్వీట్ హౌస్ లో.. కాలం చెల్లిన స్నాక్స్ ప్యాకెట్లను విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫిర్యాదు అందటంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. బూజు పట్టిన స్వీట్లు, విషపూరితంగా మారిన తినుబండారాలను గుర్తించారు. సదరు స్వీట్ హౌస్ పై మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టారు. కేవలం రూ. 6000 జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు.

జిల్లాల్లో నాసిరకం, నాణ్యతలేని, కల్తీ వస్తువులు, అమ్ముతున్నప్పటికిని పట్టించుకునే వారే లేరని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని… ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

నిబంధనలు పాటించాలి : ఫుడ్ ఇన్ స్పెక్టర్ ప్రత్యూష

హోటల్, రెస్టారెంట్, కిరాణా, మిఠాయిల దుకాణాదారులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఫుడ్ ఇన్ స్పెక్టర్ ప్రత్యూష స్పష్టం చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, వస్తువులు వాడినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యజమానులందరూ ఆహార పదార్థ విక్రయ లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. ఇటీవల గ్రిల్ 9 హోటల్ లో బిర్యానీ తిని బాలిక చనిపోవడంతో ఆ హోటల్ ని సీజ్ చేసినట్లు ప్రకటించారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం