Shilpa Shetty Restaurant: బీఎండబ్ల్యూ కారునే దొంగిలించారు.. స్టార్ హీరోయిన్ రెస్టారెంట్లో ఘటన-shilpa shetty restaurant bastian bmw car worth 80 lakhs stolen police searching for culprits ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shilpa Shetty Restaurant: బీఎండబ్ల్యూ కారునే దొంగిలించారు.. స్టార్ హీరోయిన్ రెస్టారెంట్లో ఘటన

Shilpa Shetty Restaurant: బీఎండబ్ల్యూ కారునే దొంగిలించారు.. స్టార్ హీరోయిన్ రెస్టారెంట్లో ఘటన

Hari Prasad S HT Telugu

Shilpa Shetty Restaurant: స్టార్ హీరోయిన శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్ నుంచి ఓ లగ్జరీ బీఎండబ్ల్యూ కారునే దొంగిలించిన ఘటన షాక్ కు గురి చేస్తోంది. పోలీసులు ఇప్పుడు ఆ దొంగలను పట్టుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.

బీఎండబ్ల్యూ కారునే దొంగిలించారు.. స్టార్ హీరోయిన్ రెస్టారెంట్లో ఘటన

Shilpa Shetty Restaurant: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. ముంబైలోని దాదర్ వెస్ట్ లో కోహినూర్ స్క్వేర్ 48వ అంతస్తులో ఉన్న ఆమె రెస్టారెంట్ కు వచ్చిన ఓ కస్టమర్ బీఎండబ్ల్యూ కారునే ఎవరో దొంగిలించారు. ఆదివారం (అక్టోబర్ 27) ఈ ఘటన జరిగింది. రూ.80 లక్షల విలువైన ఈ టూ సీటర్ కారును బిల్డింగ్ పార్కింగ్ ఏరియా నుంచి ఎత్తుకెళ్లడం గమనార్హం.

బీఎండబ్ల్యూ కారు చోరీ

బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్ కు ఆదివారం 34 ఏళ్ల వ్యాపారవేత్త రుహాన్ ఫిరోజ్ ఖాన్ వచ్చాడు. మరో ఇద్దరితో కలిసి అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత అతడు వచ్చి తన బీఎండబ్ల్యూ జెడ్ 4 కారును రెస్టారెంట్ వాలెట్ పార్కింగ్ ఉద్యోగికి అప్పగించాడు.

రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత చూస్తే ఆ కారు కనిపించకుండా పోయింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే ఆ కారును 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తేలింది. ఈ కారు విలువ ఏకంగా రూ.80 లక్షలు కావడం విశేషం.

కారును వెతుకుతున్న పోలీసులు

తన కారు చోరీ అయిన వెంటనే రుహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి శివాజీ పార్క్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 303 (2) (దొంగతనం కేసు) కింద కేసు నమోదు చేశారు. దగ్గర్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించి దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు రుహాన్ న్యాయవాది తెలిపారు.

శిల్పా శెట్టి ముంబైలోని దాదర్ వెస్ట్ లో ఉన్న కోహినూర్ స్క్వేర్ 48వ అంతస్తులో ఈ బాస్టియన్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది. ముంబై సిటీ అందాలను చూస్తూ రెస్టారెంట్ రుచులను ఆస్వాదించే అవకాశం ఇందులో దొరుకుతుంది. ఈ రెస్టారెంట్ కు ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ నటులూ వస్తుంటారు. అలాంటి రెస్టారెంట్ నుంచి లగ్జరీ కారు చోరీకి గురి కావడం షాక్ కు గురి చేస్తోంది.

1993లో బాజీగర్ మూవీ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది శిల్పా శెట్టి. నటనతోపాటు వెల్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఆథర్, వ్యాపారవేత్తగా కూడా ఆమె వ్యవహరిస్తోంది. రాజ్ కుంద్రా అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఈ ఇద్దరూ కలిసి ఈ రెస్టారెంట్ తోపాటు మరెన్నో వ్యాపారాలను నడిపిస్తున్నారు.