Suryakumar Yadav: బంగ్లాదేశ్‌పై తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డ్, లిస్ట్‌లో ఇక ముగ్గురే!-india t20i captain suryakumar yadav overtakes jos buttler in most sixes in t20i record ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Suryakumar Yadav: బంగ్లాదేశ్‌పై తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డ్, లిస్ట్‌లో ఇక ముగ్గురే!

Suryakumar Yadav: బంగ్లాదేశ్‌పై తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల రికార్డ్, లిస్ట్‌లో ఇక ముగ్గురే!

Galeti Rajendra HT Telugu
Updated Oct 07, 2024 06:24 AM IST

Most Sixes In T20Is: బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నది కాసేపే. కానీ..క్రీజులో ఉన్నంతసేపు బంగ్లా బౌలర్లకి చుక్కలు చూపించేశాడు. ఆడిన 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 29 పరుగులు చేశాడు.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (AFP)

India vs Bangladesh 1st T20I: వన్డే, టెస్టుల్లో ఆశించిన మేర సత్తాచాటలేకపోయిన సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో మాత్రం రికార్డుల మోత మోగించేస్తున్నాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో సూర్య 3 సిక్సర్లు బాదాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇటీవల టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ 159 టీ20ల్లో 205 సిక్సర్లు బాదాడు. ఇక రెండో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ ఉన్నాడు. 122 మ్యాచ్‌ల్లో 173 సిక్సర్లను గప్తిల్ బాదాడు. ఈ రికార్డ్‌లో మూడో స్థానంలో వెస్టిండీస్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ 98 మ్యాచ్‌ల్లో 144 సిక్సర్లతో ఉన్నాడు.

సూర్యకుమార్ యాదవ్ 73 మ్యాచ్‌ల్లోనే 139 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 124 మ్యాచ్‌ల్లో 137 సిక్సర్లతో నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ముగిసేలోపే నికోలస్ పూరన్ రికార్డ్‌ను కూడా సూర్య బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు.

గ్వాలియర్‌లోని న్యూమాధవ్ రావు సింధియా క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు బ్యాట్ ఝళిపించిన సూర్య.. బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టబోయి ఔటైపోయాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ ఇదే ప్రదర్శన కనబరిస్తే మళ్లీ ఈ ఫార్మాట్‌లో ప్రపంచ నెం.1 బ్యాటర్‌గా సూర్య నిలిచే అవకాశం ఉంది.

తొలి టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి భారత్ జట్టు ఛేదించేసింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ జట్టు 1-0తో ఆధిక్యాన్ని అందుకోగా.. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 9న (బధవారం) ఢిల్లీ వేదికగా జరగనుంది.

Whats_app_banner