IND vs BAN 2nd T20 Highlights: 92 ఏళ్ల భారత్ క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైమ్ ఇలా.. బౌలింగ్ చేస్తే వికెట్
IND vs BAN 2nd T20: టీ20ల్లో అరుదైన ఘనతని టీమిండియా సాధించింది. బంగ్లాదేశ్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఏడుగురు బౌలర్లతో సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయించగా.. 92 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రికార్డ్ సొంతమైంది.
బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. ఈ సిరీస్‌తో పాటు అరుదైన ఘనతని కూడా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ టీ20 జట్టు దక్కించుకుంది.
ఏడుగురుకి ఫస్ట్ టైమ్ వికెట్లు
భారత్ జట్టు దాదాపు 92 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతోంది. కానీ.. ఇప్పటి వరకు మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన ఏడుగురు బౌలర్లకీ వికెట్ పడిన సందర్భం లేదు. అయితే.. ఫస్ట్ టైమ్ ఢిల్లీ టీ20తో ఈ ఘనతను భారత్ జట్టు సాధించింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత్ మొత్తం ఏడుగురు బౌలర్లను ఉపయోగించగా, ఆశ్చర్యకరంగా ప్రతి బౌలర్ కనీసం ఒక వికెట్ తీశాడు. భారత క్రికెట్ చరిత్రలో ఒక ఫార్మాట్‌లో ఏడుగురు బౌలర్లు బౌలింగ్ చేసి వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
92 ఏళ్లుగా ఎదురుచూపులు
1932లో భారత్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా.. ఆ తర్వాత వన్డే, టెస్టులు, టీ20లు ఇలా ఏ ఫార్మాట్‌లోనూ ఇప్పటి వరకు ఏడుగురు భారత బౌలర్లు వికెట్లు తీయలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా మాత్రం మూడు జట్లు ఈ ఘనతని ఇప్పటికే అందుకున్నాయి.
టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 7 మంది బౌలర్లు నాలుగు సార్లు వికెట్లు తీయగా, వన్డేల్లో 10 సార్లు 7 మంది బౌలర్లు వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఈ ఘనతని భారత్ సాధించడానికి మాత్రం 92 ఏళ్లు పట్టింది. అయితే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనూ ఎనిమిది మంది బౌలర్లు ఒక ఇన్నింగ్స్‌లో వికెట్లు తీసిన సందర్భాలు లేవు.
హార్దిక్ కూడా బౌలింగ్ చేసుంటే?
బంగ్లాదేశ్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ మినహా మిగతా ఆటగాళ్లంతా బౌలింగ్ చేశారు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా కూడా రెగ్యులర్ బౌలర్. కానీ.. అతనికి సూర్యకుమార్ యాదవ్ విశ్రాంతినిచ్చి అభిషేక్ శర్మతో బౌలింగ్ చేయించాడు.
ఒకవేళ హార్దిక్ కూడా బౌలింగ్ చేసి ఉంటే.. 8 మంది బౌలర్లు కనీసం ఒక వికెట్ తీసిన తొలి జట్టుగా భారత్ నిలిచి ఉండేదేమో. బోర్డుపై భారీ స్కోరు ఉండటంతో జట్టులోకి కొత్తగా వచ్చిన ప్లేయర్లతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించడం ద్వారా వారిని ప్రోత్సహించాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావించాడు. ఒకవేళ పరుగులు ఇచ్చినా మ్యాచ్ ఓడే ప్రమాదం లేకపోవడంతో.. అభిషేక్ శర్మ లాంటి పార్ట్ టైమర్‌తోనూ బౌలింగ్ చేయించాడు. భవిష్యత్తులో ఇలాంటి బౌలర్లే టీమ్‌కి ఉపయోగపడతారు.
తేలిపోయిన బంగ్లాదేశ్
మ్యాచ్‌లో నితీశ్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్ తలో వికెట్ తీశారు.
రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నితీశ్ రెడ్డి, రింకు సింగ్ హాఫ్ సెంచరీలు బాదడంతో 221 పరుగులు చేసింది. కానీ.. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక నామమాత్రమైన ఆఖరి టీ20 మ్యాచ్ శనివారం హైదరాబాద్ వేదికగా జరగనుంది.