India Womens Cricket Team: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌‌‌లో భారత్ అద్భుత విజయం.. సెమీస్ రేసు నుంచి శ్రీలంక ఔట్-india achieve biggest ever womens t20 world cup 2024 win cross new zealands nrr ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Womens Cricket Team: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌‌‌లో భారత్ అద్భుత విజయం.. సెమీస్ రేసు నుంచి శ్రీలంక ఔట్

India Womens Cricket Team: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌‌‌లో భారత్ అద్భుత విజయం.. సెమీస్ రేసు నుంచి శ్రీలంక ఔట్

Galeti Rajendra HT Telugu
Oct 10, 2024 05:34 AM IST

India Women vs Sri Lanka Women: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్-2024లో భారత్ జట్టు ఎవరూ ఊహించనిరీతిలో అద్భుతం చేసింది. శ్రీలంకపై టోర్నీలోనే భారీ విజయాన్ని నమోదు చేస్తూ సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.

భారత్ ఉమెన్స్ టీమ్ సెమీస్ ఆశలు సజీవం
భారత్ ఉమెన్స్ టీమ్ సెమీస్ ఆశలు సజీవం (BCCI)

యూఏఈ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్-2024లో భారత మహిళల జట్టు అద్భుత విజయంతో సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. శ్రీలంకతో బుధవారం రాత్రి జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. గ్రూప్- ఎ పాయింట్ల పట్టికలో నెం.2 స్థానానికి చేరుకుంది.

టోర్నీలో ఇక తర్వాత మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆదివారం షార్జా వేదికగా భారత్ జట్టు ఆడనుంది. లీగ్ దశలో ఇదే భారత్‌కి చివరి మ్యాచ్. గ్రూప్- ఎ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కి అర్హత సాధిస్తాయి. పట్టికలో ఆస్ట్రేలియా కూడా భారత్‌తో సమానంగా 4 పాయింట్లతో టాప్‌లో ఉంది.

మెరిసిన భారత్ ఓపెనర్లు

మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. సెమీస్ చేరాలంటే చావోరేవో మ్యాచ్ కావడంతో ఓపెనర్లు షెఫాలి వర్మ (43: 40 బంతుల్లో 4x4), స్మృతి మంధాన (50: 38 బంతుల్లో 4x4, 1x6) సమయోచితంగా ఆడి తొలిసారి టోర్నీలో భారత్ జట్టుకి మెరుగైన ఆరంభం ఇచ్చారు.

12.4 ఓవర్లు ఆడిన ఈ జంట తొలి వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ దూకుడుని కొనసాగిస్తూ 27 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో అజేయంగా 52 పరుగులు చేసింది. దాంతో భారత్ జట్టు మెరుగైన స్కోరుని అందుకోగలిగింది.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మెడనొప్పి కారణంగా మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన హర్మన్.. ఈ మ్యాచ్‌లో చాలా ఉత్సాహంగా బ్యాటింగ్ చేస్తూ భారీ షాట్లు ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ (16) నిరాశపరిచింది. శ్రీలంక ఉమెన్స్ టీమ్ బౌలర్లలో ఆటపట్టు, కంచర చెరో వికెట్ టీశారు.

భారత్ బౌలర్ల దెబ్బకి లంక విలవిల

173 పరుగుల లక్ష్యఛేదనలో ఏ దశలోనూ శ్రీలంక మహిళల జట్టు సాధికారికంగా ఆడలేకపోయింది. కెప్టెన్ ఆటపట్టు (1), ఓపెనర్ వంశీ గుణరత్నె (0)తో పాటు నెం.3లో ఆడిన హర్షిత (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోయారు. దాంతో ఒత్తిడికి గురైన శ్రీలంక టీమ్ వరుసగా వికెట్లు చేజార్చుకుని 19.5 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలిపోయింది.

భారత్ బౌలర్లలో బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ వికెట్లు దక్కాయి. అరుంధతి రెడ్డి, ఆశా శోభనకి మూడేసి వికెట్లు, రేణుక ఠాకూర్ సింగ్‌కి రెండు, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మకి చెరో వికెట్ దక్కింది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఈ బౌలర్ల బృందం ఇలానే సమష్టిగా రాణించింది.

ఒక్కసారి మైనస్ నుంచి ప్లస్‌లోకి

మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో 58 పరుగులు తేడా ఓడిన భారత్ మహిళల జట్టు.. నెట్ రన్‌రేట్ విషయంలో చాలా వెనుకబడింది. ఒకానొక దశలో టోర్నీలోనే అత్యంత చెత్త నెట్‌ రన్‌రేట్ ఉన్న టీమ్‌గా నిలిచింది. కానీ.. శ్రీలంకపై 82 పరుగుల తేడాతో గెలవడం ద్వారా మైనస్ నుంచి ఒక్కసారిగా భారత్ నెట్‌ రన్‌రేట్ +0.576కి చేరుకుంది.

గ్రూప్- పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్లు రెండేసి విజయాలతో టాప్-2లో ఉండగా.. నెట్ రన్‌రేట్ విషయంలోనూ ఈ రెండు జట్లదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్ జట్టు భారీ తేడాతో గెలవగలిగితే సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌కి చేరవచ్చు.

ఇక ఆస్ట్రేలియానే అడ్డు

ఒకవేళ భారత్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి.. న్యూజిలాండ్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, పాకిస్థాన్ జట్లని భారీ తేడాతో ఓడిస్తే.. అప్పుడు భారత్‌కి కష్టం అవుతుంది. టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక టీమ్.. మూడింటిలోనూ ఓడిపోయి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు వరుసగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా, భారత్ చేతిలో ఓడిపోయింది. ఇక ఆఖరి మ్యాచ్ ఈ నెల 15న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా.. ఓడినా.. శ్రీలంక ఇంటికి వెళ్లిపోతుంది.

Whats_app_banner