India Women Cricket Team: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టుకి గుడ్‌న్యూస్, ఇక ఆ టెన్షన్ లేదు
Harmanpreet Kaur Injury Update: పాకిస్థాన్‌తో మ్యాచ్ మధ్యలోనే గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ తీసుకుని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పెవిలియన్‌కి వెళ్లిపోయింది. ఈరోజు శ్రీలంకతో కీలకమైన మ్యాచ్‌ను భారత్ జట్టు ఆడనుంది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో శ్రీలంకతో కీలకమైన మ్యాచ్ ముంగిట భారత్‌కి గుడ్‌న్యూస్. గాయం కారణంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ మధ్యలోనే పెవిలియన్‌కి వెళ్లిపోయిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్ సాధించింది. ఈమేరకు మ్యాచ్ ముంగిట వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది.
దుబాయ్ వేదికగా శ్రీలంకతో ఈరోజు చావోరేవో పోరులో భారత్ ఉమెన్స్ టీమ్ తలపడనుంది. పాకిస్థాన్‌పై గత ఆదివారం భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ స్లో బ్యాటింగ్ కారణంగా నెట్ రన్ రేట్ ఆశించినంత మెరుగవలేదు. దానికి కారణం అప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 58 పరుగుల ఆరీ భారీ తేడాతో ఓడిపోవడమే.
ఓడితే.. ఇంటికే
భారత్ జట్టు మహిళల టీ20 వరల్డ్‌కప్ -2024 సెమీస్ చేరాలంటే ఈరోజు శ్రీలంకతో మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అది కూడా భారీ తేడాతో. లేకపోతే టోర్నీ నుంచి సెమీస్ చేరకుండానే నిష్క్రమించే ప్రమాదం ఉంది.
ఈ రోజు శ్రీలంకపై భారత జట్టు విజయం సాధిస్తే గ్రూప్- ఎ పాయింట్ల పట్టికలో టాప్-2లో చోటు దక్కించుకుంటుంది. అయితే, ఈ విజయంతో పాటు, హర్మన్ అండ్ కో నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడంపై కూడా దృష్టి పెట్టాలి. దూకుడుగా బ్యాటింగ్ చేయగల హర్మన్ టీమ్‌లో ఉంటే.. భారత్ జట్టు వేగంగా పరుగుల్ని చేయగలదు.
భారత్ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ, ఐదు జట్లు ఉన్న గ్రూప్‌లో ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉంది. భారత్‌తో సమానంగా రెండు పాయింట్లతో ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా టీమ్ 4 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.
హర్మన్ ఓకే.. కానీ పూజా డౌట్
శ్రీలంకతో మ్యాచ్‌కి ముందు దుబాయ్‌లో మంధాన విలేకరులతో మాట్లాడుతూ.. హర్మన్ ఫిట్‌గా ఉందని, శ్రీలంకపై మ్యాచ్ ఆడుతుందని క్లారిటీ ఇచ్చింది. అయితే గాయం కారణంగా పాకిస్థాన్‌తో సిరీస్‌కు దూరమైన ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ ఫిట్‌నెస్ గురించి మంధాన ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
పూజా ఫిట్‌నెస్‌ను మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని.. ఆమె ఆడటంపై బుధవారం సాయంత్రానికి క్లారిటీ రానుందని మంధనా చెప్పుకొచ్చింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి భారత్, శ్రీలంక మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది.
మంధాన ఫెయ్యిలర్
టోర్నీలో మంధాన ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను ఓడించిన శ్రీలంక జట్టుతో భారత్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.
యూఏఈ పరిస్థితుల గురించి మంధాన మాట్లాడుతూ "ఇక్కడి పరిస్థితులు మేము అనుకున్నదానికి చాలా భిన్నంగా ఉన్నాయి. బ్యాలెన్స్‌గా ఆడటానికి ప్రయత్నిస్తున్నాం. ఈ పిచ్‌లపై అడ్డదిడ్డంగా కాకుండా బ్యాటర్ తెలివిగా ఆడాలి" అని చెప్పుకొచ్చింది.