IND vs SA: దక్షిణాఫ్రికాను క్లీన్‍స్వీప్ చేసిన టీమిండియా.. వరల్డ్ రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
IND vs SA Women ODI Series: దక్షిణాఫ్రికాను భారత మహిళల జట్టు చిత్తుచేసింది. మూడో వన్డేలోనూ విజయం సాధించింది. దీంతో సఫారీ జట్టును హర్మన్‍ప్రీత్ సేన క్లీన్‍స్వీప్ చేసేసింది.

IND vs SA: దక్షిణాఫ్రికాపై భారత మహిళల టీమ్ మరోసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో సఫారీ జట్టుకు చుక్కలు చూపింది. మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించి 3-0తో సిరీస్‍ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో మ్యాచ్‍లో అలవోక విజయంతో మెరిసింది. బెంగళూరు వేదికగా నేడు (జూన్ 23) జరిగిన మూడో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై ఆడుతూ పాడుతూ గెలిచింది. 56 బంతులు మిగిల్చి మరీ విజయం సాధించింది.
మళ్లీ మెరిసిన మంధాన.. కాస్తలో సెంచరీ మిస్
దక్షిణాఫ్రికాతో ఈ సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍ల్లో సెంచరీలతో అదరగొట్టిన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. మూడో వన్డేలోనూ అద్భుతంగా ఆడారు. 216 పరుగుల లక్ష్యఛేదనలో మంధాన దుమ్మురేపారు. 83 బంతుల్లోనే స్మృతి మంధాన 90 పరుగులు చేశారు. ఏకంగా 11 ఫోర్లు బాదారు. అయితే, హ్యాట్రిక్ సెంచరీని మంధాన కాస్తలో మిస్ చేసుకున్నారు. 31వ ఓవర్లో ఆమె ఔటయ్యారు. దీంతో నిరాశగా పెవిలియన్ చేరారు. అయితే, అప్పటికే భారత్‍ను విజయానికి చేరువ చేశారు.
మొత్తంగా 40.4 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసి భారత్ విజయం సాధించింది. ముందుగా యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ (25), ప్రియా పునియా (28) కాసేపు నిలిచారు. నిలకడగా ఆడారు. అయితే, మరో ఎండ్‍లో స్మృతి మంధాన మొదటి నుంచే దూకుడుగా ఆడారు. దీంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. షెఫాలీ, ప్రియా ఔటైనా.. స్మృతి మాత్రం ఏ మాత్రం దూకుడు తగ్గించలేదు.
ఆ తర్వాత స్మృతికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 42 పరుగులు) మరోసారి రాణించారు. అయితే, 31వ ఓవర్లో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మతి ఔటయ్యారు. ఆ తర్వాత బాధ్యతను హర్మన్ భుజానికెత్తుకున్నారు. గెలుపునకు చేరువైన తరుణంలో 41వ ఓవర్లో హర్మన్ రనౌట్ అయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ (19 నాటౌట్) నిలకడగా ఆడారు. మొత్తంగా 56 బంతులు మిగిల్చి భారత్ అలవోకగా గెలిచింది.
ఓపెనర్లు రాణించినా..
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది దక్షిణాఫ్రికా. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనింగ్‍కు వచ్చిన కెప్టెన్ లారా వోల్‍వాట్ (61) అర్ధ శకతంతో రాణించగా.. మరో ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్జ్ (38) పర్వాలేదనిపించారు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి వేగంగా పరుగులు చేయలేకపోయారు. చివర్లో నడైన్ డె క్లెర్క్ (26), డీ రిడ్డెర్ (26 నాటౌట్) కాసేపు నిలువడంతో ఆ మాత్రం స్కోరు వచ్చింది.
భారత బౌలర్లలో అరుంధతీ రాయ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లతో రాణించారు. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
మంధాన మరో రెండు రికార్డులు
దక్షిణాఫ్రికాతో ఈ సిరీస్‍లో భారత స్టార్ స్మృతి మంధాన 343 పరుగులు సాధించారు. దీంతో ఓ మూడు వన్డేల సిరీస్‍లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించారు స్మృతి. దక్షిణాఫ్రికా ప్లేయర్ లారా వాల్‍వాట్ (2024 శ్రీలంకపై 335 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి దాటేశారు.
ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‍లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గానూ స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. ఈ సిరీస్‍లో ఆమె మొత్తంగా 343 పరుగులు చేశారు. దీంతో జయశర్మ (2004లో న్యూజిలాండ్‍తో సిరీస్‍లో 309 పరుగులు)ను స్మృతి అధిగమించారు.
భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జూన్ 28వ తేదీన మొదలుకానుంది. ఈ టెస్టు చెన్నై వేదికగా జరగనుంది.