Womens T20 World Cup 2024: భారత్ జట్టుకి నేడు శ్రీలంకతో చావోరేవో పోరు, ఓడితే ఇంటికే!
India Women vs Sri Lanka Women: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటికే సెమీస్ ఆశలు వదిలేసిన శ్రీలంక టీమ్ ఈరోజు స్వేచ్ఛగా ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంది. మరోవైపు భారత్ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే ఈరోజు మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత మహిళ జట్టుకి బుధవారం మరో కఠిన పరీక్ష ఎదురుకాబోతోంది. తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ మహిళల జట్టు చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ జట్టు.. భారీగా నెట్ రన్‌రేట్‌ను నష్టపోయింది.
పాకిస్థాన్‌పై గత ఆదివారం గెలిచినా.. ఇంకా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన చింత తీరలేదు. టోర్నీలో భారత్ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే రోజు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో తప్పక ఓడించాలి. అది కూడా భారీ తేడాతో భారత్ గెలిస్తేనే రేసులో నిలవగలదు.
శ్రీలంకకి పోయేదేం లేదు
దుబాయ్ వేదికగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి గ్రూప్-ఎలో ఉన్న భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక టీమ్ రెండింటిలోనూ ఓడిపోయింది. కాబట్టి.. ఈరోజు ఆ జట్టు గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో స్వేచ్ఛగా లంక టీమ్ బ్యాటర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది.
మరోవైపు భారత్ జట్టుకి ఈ మ్యాచ్ గెలుపు పరంగానే కాదు.. నెట్ రన్‌రేట్ పరంగా కూడా చాలా కీలకం. ప్రస్తుతం -1.217 నెట్‌రన్‌రేట్‌తో ఉన్న భారత్ జట్టు.. ఈరోజు మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవగలితే ప్లస్‌లోకి వచ్చేస్తుంది. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌కి ముందు కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకి ఉత్సాహం వస్తుంది.
చేజారిన అవకాశం
వాస్తవానికి మంగళవారం రాత్రి ఒకవేళ న్యూజిలాండ్‌ను జట్టుని ఆస్ట్రేలియా ఓడించి ఉంటే.. భారత్ జట్టు ఇంత కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాపై గెలిచి ఉన్నా.. సెమీస్ రేసులో నిలిచేది.
కానీ.. మంగళవారం రాత్రి న్యూజిలాండ్ టీమ్‌ను 60 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడించింది. దాంతో చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని భారత్ తప్పక ఓడించాలి.. అది కూడా మెరుగైన నెట్ రన్‌రేట్ దక్కేలా. కాబట్టి..ఈరోజు శ్రీలంకపై గెలిస్తే.. భారత్ జట్టుకి ఆ ఉత్సాహం లభిస్తుంది.
ఓడితే.. ఇక సర్దుకోవడమే
ఒకవేళ భారత్ జట్టు పొరపాటున ఈరోజు శ్రీలంక చేతిలో ఓడిపోతే సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. రికార్డులు కూడా భారత్ జట్టుకి అనుకూలంగానే ఉన్నాయి.
శ్రీలంక టీమ్‌తో ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్‌లాడిన భారత్ జట్టు ఏకంగా 19 మ్యాచ్‌ల్లో గెలిచింది. మిగిలిన ఆరింటిలో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. మిగిలిన ఐదింటిలో లంక గెలిచింది. టోర్నీలో ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్ చేతిలో శ్రీలంక ఓడిన విషయం తెలిసిందే.
ప్లాన్ మారుస్తారా?
సెమీస్ ఆశలు ఎగిరిపోవడంతో శ్రీలంక టీమ్ ఈరోజు మ్యాచ్‌లో ఎదురుదాడి చేసే అవకాశాలు లేకపోలేదు. ఆ జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు ఏ ప్రత్యర్థికైనా సవాల్‌ను విసరగలదు. అలానే నీలాక్షిక, విష్మిపై కూడా భారత్ బౌలర్లు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంది.
పాకిస్థాన్‌పై సమష్టిగా రాణించిన భారత్ ఉమెన్స్ టీమ్.. మరోసారి అదే జోరుని ఈరోజు కొనసాగించాలి. అయితే.. బ్యాటర్లు కాస్త దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మ్యాచ్‌కి ముందు క్లారిటీ ఇచ్చింది.