IndiaW vs Sri LankaW: ఆసియా కప్‌లో భారత్ మహిళల జట్టు బోణి.. శ్రీలంకపై అద్భుత విజయం
India women vs Sri Lanka Women: మహిళల ఆసియా కప్‌లో భాగంగా అక్టోబరు 1న ప్రారంభమైన రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై భారత అమ్మాయిలు 41 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్ జెమీయా రోడ్రిగ్స్ అర్ధశతకంతో ఆకట్టుకున్నారు.
IndW vs SLW Asia Cup 2022: టీ20 మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఈ రోజు భారత అమ్మాయిలు.. శ్రీలంక జట్టుతో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు.. శ్రీలంకపై 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిల్హౌట్ వేదికగా జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు భారీ స్కోరును సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక మహిళల జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. హాసిని పెరీరా(30) ఒక్కరే అత్యధిక పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో హేమలత 3 వికెట్లతో ఆకట్టుకోగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ తలో రెండు వికెట్లతో రాణించారు.
151 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన శ్రీలంక మహిళల జట్టుకు శుభారంభమేమి దక్కలేదు. నాలుగో ఓవర్‌లోనే ఆ జట్టు కెప్టెన్ చమారి ఆటపట్టును(5) దీప్తి శర్మ పెవిలియన్ చేర్చింది. అనంతరం ఆ కాసేపటికే మల్షా షెహానిని మరోసారి దీప్తి రనౌట్ చేసింది. ఇలాంటి సమయంలో ఓపెనర్ హర్షితా మాదవి(26) మాత్రం ధాటిగా ఆడింది. బౌండరీలతో శ్రీలంక అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. అయితే ప్రమాదకరంగా మారుతున్న హర్షితాను స్మృతి మంధనా రనౌట్ చేసింది.
ఆ కాసేపటికే నిల్కాషి డిసిల్వాను.. పూజా ఎల్బీడబ్ల్యూ చేసి.. ఆ తర్వాత ఓవర్లోనే మరోసారి కవిశా దిల్హారీని పెవిలియన్ చేర్చింది. దీంతో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది శ్రీలంక మహిళల జట్టు ఇలాంటి సమయంలో హాసిని పెరీరా నిలకడగా ఆడింది. వికెట్లకు అడ్డుకట్టకు ప్రయత్నించింది. అయితే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోకి వచ్చిన శ్రీలంక బ్యాటర్లు మాత్రం ఎక్కువ సేపు క్రీజులో నిలుచులేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
అనుష్క సంజీవిని, ఒషాది రణసింఘే, సుగాందికా కుమారి, హాసినీ పెరీరా, అచిన్ కుల్సారియా కొద్ది వ్యవధిలోనే వికెట్లు కోల్పోయారు. ఫలితంగా 18.2 ఓవర్లలో 109 పరుగుల వద్ద శ్రీలంక అమ్మాయిలు ఆలౌట్‌గా నిలిచారు. చివరి వరకు హాసిని వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు.
అంతకుముందు బ్యాటింగ్ ఆడిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జెమీయా రోడ్రిగ్స్(76) అర్ధశతకంతో విజృంభించగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(33) రాణించింది. ఆరంభంలో త్వరితంగతిన వికెట్లు కోల్పోయిన భారత మహిళల జట్టు.. అనంతరం జెమీమా క్రీజులో నిలబడటంతో మెరుగైన స్కోరు సాధించింది. 53 బంతుల్లో 76 పరుగులతో రోడ్రిగ్స్ అదరగొట్టింది. ఇందులో 11 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. శ్రీలంక బౌలర్లలో ఓషాడి రణసింఘే మూడు వికెట్లతో ఆకట్టుకుంది.
సంబంధిత కథనం