శ్రీలంకపై భారత బౌలర్లు మరోసారి రాణించారు. రెండో టీ20లోనూ ముందుగా రెచ్చిపోయిన లంక బ్యాటర్లను ఆ తర్వాత కట్టడి చేసింది టీమిండియా. పల్లెకెెలె వేదికగా నేడు (జూలై 28) జరుగుతున్న రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఓ దశలో 15.1 ఓవర్లలో 130 పరుగులకు 3 వికెట్లే కోల్పోయి పటిష్టంగా ఉన్న లంకను ఆ తర్వాత భారత బౌలర్లు కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీశారు. దీంతో మోస్తరు స్కోరుకే లంక పరిమితమైంది. భారత్ ముందు 161 పరుగుల లక్ష్యం నిలిచింది. లంక బ్యాటింగ్ ఎలా సాగిందంటే..
వాన వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‍లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో శ్రీలంక ముందుగా బ్యాటింగ్‍కు దిగింది. లంక ఓపెనర్ కుషాల్ మెండిస్ (10)ను నాలుగో ఓవర్లో ఔట్ చేశాడు భారత పేసర్ అర్షదీప్ సింగ్. మరో ఎండ్‍లో పాతుమ్ నిస్సంక (24 బంతుల్లో 32 పరుగులు) దూకుడుగా ఆడాడు. అతడికి జత కలిసిన కుషాల్ పెరీరా (34 బంతుల్లో 54 పరుగులు; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆరంభం నుంచి ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. దీంతో లంక స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 5.2 ఓవర్లలోనే 50 రన్స్ దాటింది. తొమ్మిదో ఓవర్లో నిస్సంకను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్.
ఆ తర్వాత కూడా కుషాల్ పెరీరా ఏ మాత్రం తగ్గలేదు. బాదేస్తూ ముందుకు సాగాడు. అయితే, కమిందు మెండిస్ ( 23 బంతుల్లో 26) నెమ్మదిగా ఆడి ఔటయ్యాడు. జోరు సాగించిన పెరీరా 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కుషాల్ పెరీరాను 16వ ఓవర్లో ఔట్ చేశాడు భారత బౌలర్ హార్దిక్ పాండ్యా. దీంతో 139 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది శ్రీలంక. ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దసున్ శనక (0), వణిందు హసరంగ (0)ను 17వ ఓవర్లలో వరుస బంతుల్లో ఔట్ చేశారు భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్. మహీశ్ తీక్షణ (2)ను అక్షర్ వెనక్కి పంపాడు. కెప్టెన్ చరిత్ అసలంక (12 బంతుల్లో 14 పరుగులు) కాసేపు చివరి ఓవర్ వరకు నిలిచినా ధాటిగా ఆడలేకపోయాడు. 20వ ఓవర్లో ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (10 బంతుల్లో 12) కాసేపు నిలిచాడు. చివరి ఐదు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే చేయగలిగింది లంక. మొత్తంగా 161 పరుగుల మోస్తరు స్కోరుకు పరిమితమైంది. గత మ్యాచ్ లాగే ముందుగా అదరగొట్టిన లంక.. చివర్లో చతికిలపడింది.
భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
భారత్ ముందు 162 పరుగుల మోస్తరు లక్ష్యం ఉంది. ఈ మూడు టీ20ల సిరీస్‍లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‍లో టార్గెట్ ఛేదిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ టీమిండియా కైవసం అవుతుంది.