Hardik Pandya Catch: బౌండరీ లైన్ వద్ద పల్టీలు కొట్టినా క్యాచ్ వదలని హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
India vs Bangladesh 2nd T20: బంగ్లాదేశ్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. మిడ్ వికెట్ నుంచి ఏకంగా 25 మీటర్లు పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ లాంగాన్‌లో క్యాచ్ పట్టాడు.
భారత జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద అతను పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

అదరగొట్టిన భారత్ బ్యాటర్లు
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి 34 బంతుల్లో 74 పరుగులు చేయగా.. రింకు సింగ్ 29 బంతుల్లో 53 పరుగులు చేశాడు. చివర్లో దూకుడుగా ఆడిన హార్దిక్ పాండ్యా కూడా 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేయగలిగింది. ఆ టీమ్‌లో మహ్మదుల్లా మాత్రమే 39 బంతుల్లో 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
క్యాచ్ పట్టినా.. బ్యాలెన్స్ మిస్
మ్యాచ్‌లో రిషాద్ హుస్సేన్ క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద చాలా చాకచక్యంగా హార్దిక్ పాండ్యా పట్టాడు. 10 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 9 పరుగులు చేసిన రిషాద్.. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో లాంగాన్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. అయితే.. దాదాపు మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చి.. ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్‌గా బంతిని అందుకున్నాడు.
హార్దిక్ పాండ్యా పరుగెత్తుకుంటూ వచ్చిన వేగానికి బంతిని అందుకున్న తర్వాత శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. బౌండరీ లైన్ వద్ద పల్టీలు కొట్టినా.. బంతిని మాత్రం విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు. దాంతో రిషాద్ నిరాశగా పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న హార్దిక్ పాండ్యా.. ఇలా డైవ్ చేయడానికి మొన్నటి వరకు సాహసించలేదు. కానీ.. ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో స్టంట్స్ చేస్తున్నాడు.
లాస్ట్ టీ20కి హైదరాబాద్ ఆతిథ్యం
భారత్, బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా శనివారం ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ముగియనుంది. ఇటీవల భారత్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.