India Playing XI For 3rd T20: హైదరాబాద్ టీ20లో సంజు శాంసన్‌పై వేటు? టీమిండియాలో మూడు మార్పులు జరిగే సంకేతాలు
India vs Bangladesh 3rd T20: భారత్, బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకున్న టీమిండియా.. లాస్ట్ టీ20లో ప్రయోగాలకి సిద్ధమవుతోంది.
బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచిన భారత టీ20 జట్టు ఇప్పుడు ప్రయోగాలకి సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7 గంటలకి మూడో టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గ్వాలియర్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ జట్టు అలవోకగా గెలిచిన విషయం తెలిసిందే.
మూడో టీ20 కోసం ఇప్పటికే హైదరాబాద్‌కి భారత్, బంగ్లాదేశ్ జట్లు చేరుకున్నాయి. సిరీస్ చేజిక్కడంతో నామమాత్రమైన మూడో టీ20 నుంచి ఇద్దరు బౌలర్లకి రెస్ట్ ఇచ్చి.. ఒక ప్లేయర్‌పై వేటు వేయాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
సంజు శాంసన్ ఔట్
బంగ్లాదేశ్‌తో తొలి రెండు టీ20ల్లో ఓపెనర్‌గా ఆడే అవకాశం దక్కినా.. సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ సత్తాచాటలేకపోయాడు. తొలి టీ20లో 19 బంతులు ఆడిన సంజు శాంసన్ 29 పరుగులు, రెండో టీ20లో 7 బంతుల్లో 10 పరుగులు చేసి ఔటయ్యాడు.
వాస్తవానికి తొలి టీ20లో అతనికి మంచి ఆరంభం లభించినా దాన్ని పెద్ద స్కోరుగా మలచలేకపోయాడు. రెండో టీ20లో ఆరంభంలోనే పేలవంగా వికెట్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టీ20లో అతడ్ని తప్పించి వికెట్ కీపర్/ బ్యాటర్ జితేశ్ శర్మకి అవకాశం ఇవ్వాలని గంభీర్, సూర్య నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎవరు ఈ జితేశ్ శర్మ
భారత్ జట్టులోకి ఏడాది క్రితం ఎంట్రీ ఇచ్చిన 30 ఏళ్ల జితేశ్ శర్మ.. ఈ ఏడాది ఎక్కువ మ్యాచ్‌లు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైపోయాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 9 టీ20లు ఆడిన ఈ మహారాష్ట్రకి చెందిన వికెట్ కీపర్ 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన పరుగుల 100 మాత్రమే. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్‌తో టీ20లో చివరిగా అవకాశం వచ్చింది. కానీ డకౌట్ అయ్యి దాన్ని వృథా చేసుకున్నాడు. అయితే.. హైదరాబాద్ టీ20 రూపంలో మరో ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ వార్తలు వస్తున్నాయి.
రెస్ట్ ఎవరికి?
భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజూ శాంసన్‌తో పాటు మరో రెండు మార్పులు కూడా కనిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్‌లకు అవకాశం దక్కవచ్చు. ఆ ఇద్దరికి చోటిచ్చేందుకు ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి విశ్రాంతినిచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. హర్షిత్ రాణా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా భారత్ తరఫున ఆడలేదు.
మూడో టీ20కి భారత్ జట్టు (అంచనా) : అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్