IND vs BAN 2nd T20 Result: భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా కుదేలు: భారీ గెలుపుతో సిరీస్ టీమిండియా కైవసం.. నితీశ్ ఆల్‍రౌండ్ షో
IND vs BAN 2nd T20 Result: బంగ్లాదేశ్‍తో రెండో టీ20లో భారత్ అదిరిపోయే విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను కైవసం చేసుకుంది. బ్యాటింగ్‍లో నితీశ్, రింకూ దుమ్మురేపితే.. బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. బౌలింగ్‍లోనూ నితీశ్ రెండు వికెట్లు తీసి.. ఆల్‍రౌండ్ షో చేశాడు.

బంగ్లాదేశ్‍పై టీ20 సిరీస్‍ను భారత్ అదిరే ప్రదర్శనతో కైవసం చేసుకుంది. ఢిల్లీ గడ్డపై దుమ్మురేపే ఆటతో మరో ఏకపక్ష విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‍ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‍ను టీమిండియా దక్కించుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు (అక్టోబర్ 9) జరిగిన రెండో టీ20లో భారత్ 86 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‍లో దడదడలాడించి బంగ్లాను కుదేలు చేసింది సూర్యకుమార్ సేన.
సమిష్టిగా భారత బౌలర్ల దెబ్బ
222 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఏ దశలోనూ బంగ్లాదేశ్ గెలిచేలా కనిపించలేదు. భారత బౌలర్లు కలిసి కట్టుగా బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసి కుప్పకూల్చారు. దీంతో బంగ్లా లైనప్‍లో ఒక్క బ్యాటర్ మాత్రమే 20 పరుగులు మార్క్ దాటాడు. సీనియర్ బ్యాటర్ మహమ్మదుల్లా (39 బంతుల్లో 41 పరుగులు) చివరి ఓవర్ ఓవర్ వరకు నిలిచి పోరాడగా.. మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లు తీసి బంగ్లాను కోలుకోనివ్వలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 135 పరుగులే చేసిన బంగ్లా.. భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఏడుగురికి వికెట్లు.. నితీశ్ బౌలింగ్‍లోనూ..
భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. బౌలింగ్ చేసిన ఏడుగురు వికెట్ తీశారు. బ్యాటింగ్‍లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‍లో రెండు వికెట్లు దక్కించుకున్నాడు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‍లోనే తొలి హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన నితీశ్.. బౌలింగ్‍లోనూ మెరిశాడు. ఆల్‍రౌండ్ షోతో మెప్పించాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలా ఓ వికెట్ తీశారు.
బంగ్లా బ్యాటర్లలో పర్వేజ్ హుసేన్ ఇమాన్ (16), కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంతో (11), లిటన్ దాస్ (14) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. తదుపరి బ్యాటర్లు కూడా వెనువెంటనే ఔటయ్యారు. మహమ్మదుల్లా ఒక్కడే చివరి ఓవర్ నిలిచి పోరాడినా ఫలితం లేకపోయింది. వేగంగా పరుగులు చేయలేకపోయాడు. మొత్తంగా పేలవ ప్రదర్శనతో బంగ్లా కనీస పోరాటం లేకుండానే ఓడింది.
నితీశ్ ధనాధన్
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు చేసింది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 34 బంతుల్లో 74 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‍లోనే తొలి అంతర్జాతీయ అర్ధ శకతం పూర్తి చేశాడు. ముందుగా నిదానంగా ఆడిన నితీశ్.. ఆ తర్వాత భారీ హిట్టింగ్ చేశాడు. 4 ఫోర్లు కొట్టిన నితీశ్ 7 సిక్స్‌లు బాదేశాడు. రింకూ సింగ్ కూడా అర్ధ శకతంతో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఓ దశలో 3 వికెట్లకు 41 పరుగులే చేసి కష్టాల్లో పడిన టీమిండియాను నితీశ్, రింకూ ఆదుకున్నారు. 108 పరుగుల భాగస్వామ్యం జోడించారు. సంజూ శాంసన్ (10 పరుగులు), అభిషేక్ శర్మ (15), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) వెనువెంటనే ఔటయ్యాక వారిద్దరూ దుమ్మురేపారు.
నితీశ్, రింకూ ఔటయ్యాక.. చివర్లో హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 32 పరుగులతో మరోసారి తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్‍పై తొలిసారి 200 పరుగుల మార్క్ దాటింది భారత్.
హైదరాబాద్‍లో మూడో టీ20
మూడు టీ20ల సిరీస్‍లో తొలి రెండు మ్యాచ్‍లు గెలిచి భారత్ సిరీస్ దక్కించుకుంది. టీమిండియా, బంగ్లాదేశ్ మూడో టీ20 ఈ శనివారం అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరగనుంది.