White rice: ఇలా అన్నం వండారంటే ఎంత తిన్నా బరువు పెరగరు, ఆ చిట్కా ఏంటో తెలుసుకోండి-if you cook rice like this you will not gain weight no matter how much you eat know the tip ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  White Rice: ఇలా అన్నం వండారంటే ఎంత తిన్నా బరువు పెరగరు, ఆ చిట్కా ఏంటో తెలుసుకోండి

White rice: ఇలా అన్నం వండారంటే ఎంత తిన్నా బరువు పెరగరు, ఆ చిట్కా ఏంటో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Nov 26, 2024 04:30 PM IST

White rice: మనదేశంలో ప్రధాన ఆహారం అన్నమే. అన్నం కాకుండా ఎన్ని ఆహారాలు పెట్టిన సంపూర్ణ భోజనంలా అనిపించవు. అయితే అన్నం తింటే బరువు పెరుగుతామని భయం ఎక్కువమందిలో ఉంది.

తెల్లన్నం తింటూ బరువు తగ్గడం ఎలా?
తెల్లన్నం తింటూ బరువు తగ్గడం ఎలా? (pixabay)

బిర్యానీ, పలావులో, పులిహోరలు అన్నీ అన్నంతో తయారయ్యేవే. వాటిని తింటేనే పొట్ట నిండుగా అనిపిస్తుంది. సంపూర్ణ భోజనం చేసినట్టు ఉంటుంది. కానీ అన్నాన్ని తినడానికి ఇప్పుడు భయపడి పోయే వారి సంఖ్య పెరిగిపోయింది. దీనికి కారణం అన్నం ప్రతిరోజూ తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం. అందుకే అన్నాన్ని మానేసి చపాతీలు తింటున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. వైట్ రైస్‌ను ఒకపూట మాత్రమే తిని రెండో పూట చపాతీలో, రోటీలతో పొట్ట నింపుకుంటున్నారు. కానీ అది కూడా మనస్పూర్తిగా తినలేక పోతున్నారు. మీరు బరువు పెరగకుండా కూడా ప్రతిరోజూ అన్నాన్ని తినవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిన పద్ధతి అన్నాన్ని వండే స్టైల్ మార్చండి. ఏ విధంగా అన్నం వండితే బరువు పెరగకుండా ఉంటారో తెలుసుకోండి.

మీరు అన్నం తింటూ కూడా బరువు తగ్గొచ్చు. అలాగే అన్నం తిన్నా కూడా బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. చిన్నప్పటినుంచి అన్నాన్ని తిని పెరిగిన శరీరానికి అకస్మాత్తుగా వైట్ రైస్ తినడం మానేస్తే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అంతేకాదు అన్నంలో కొన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయి. దీనిలో బ్లూటూత్ ఉండదు. కాబట్టి అన్నాన్ని కూడా ప్రతిరోజు తినాల్సిన అవసరం ఉంది. రాత్రిపూట చపాతీలు తినేవారు ఎంతోమంది వాటిని కష్టంగానే తింటారు. నిజానికి అన్నం తింటూ కూడా బరువు తగ్గొచ్చు. అన్నాన్ని వండే పద్ధతి మార్చండి చాలు. మీరు చాలా సులువుగా బరువు తగ్గుతారు.

అన్నాన్ని వండే పద్ధతి

వైట్ రైస్‌ను వండేటప్పుడు అది సగం ఉడికాక అందులో ఒక స్పూను కొబ్బరి నూనె వేయండి. ఒకసారి గరిటెతో కలపండి. ఆ తర్వాత పూర్తిగా ఉడకనివ్వండి. ఇలా కొబ్బరి నూనె వేయడం వల్ల ఆ అన్నంలో కార్బోహైడ్రేట్లు సగానికి పడిపోతాయి. ఆ అన్నాన్ని మీరు తిన్నా కూడా బరువు పెరగరు. ఇంకా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ ఒక స్పూన్ కొబ్బరి నూనెతో కలిపి అన్నాన్ని వండుకొని తింటే ఎంతో మంచిది. బరువు పెరిగే అవకాశం కూడా తగ్గిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి చిట్కా. వారు అన్నం తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇలా కొబ్బరి నూనె వేసుకొని వండుకొని తినడం వల్ల వారికి కార్బోహైడ్రేట్స్ శరీరంలో చేరవు. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయో ఎవరైనా కూడా బరువు త్వరగా పెరగరు.

వైట్ రైస్ ఒక్కటే ఎక్కువగా తింటే కార్బోహైడ్రేట్స్ శరీరంలో చేరి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు సగం బియ్యం, సగం పెసరపప్పు వేసి కలుపుకొని వండండి. దాన్ని తినడం వల్ల మీకు పొట్ట నిండినట్టుగా ఉంటుంది. శక్తి కూడా శరీరంలో చేరుతుంది. ఏ కూర కావాలంటే ఆ కూరను అందులో కలుపుకొని తినవచ్చు. ఇది పొడిపొడిగా అన్నంలాగే వస్తుంది. దీనికోసం పెసరపప్పు ముందుగా నానబెట్టకూడదు. డైరెక్ట్ గా బియ్యంతో పాటే వేసి ఉడికించాలి. అప్పుడే పెసరపప్పు ముద్ద కాకుండా మెతుకుల్లాగా పొడిపొడిగా వస్తుంది. మీకు పొట్ట నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. బియ్యము, పెసలు కలిపి వండడం వల్ల ఒక కప్పు రైస్ తింటే చాలు త్వరగా పొట్ట నిండిపోతుంది. కాబట్టి ఇతర ఆహారాలు కూడా ఎక్కువగా తినలేరు. ఇది బరువు తగ్గడానికి మంచి ఉపాయం.

వైట్ రైస్ ను ఎక్కువగా తినేస్తే బరువు పెరుగుతామని భయపడేవారు... వైట్ రైస్‌లోనే కొన్ని రకాల కూరగాయ ముక్కలు వేసి కలిపి వండుకుంటే మంచిది. అప్పుడు అందులో బియ్యం పరిమాణం తగ్గుతుంది. ఈ కూరగాయల వల్ల ఫైబర్ కూడా అధికంగా చేరుతుంది. అందులోనే కాస్త ఉప్పు కూడా వేసుకుంటే నేరుగా వెజిటబుల్ రైస్‌లా తినేయవచ్చు. ఇలా అన్నంలో వండేందుకు వీలైన కూరగాయలు క్యారెట్లు, బీన్స్, రాజ్మా వంటివి. అలాగే సోయా చంక్స్‌ని అంటే సోయా పిండితో చేసే మీల్ మేకర్ కూడా కలిపి వండుకోవచ్చు. దీనివల్ల బియ్యం పరిమాణం తగ్గి ఇతర ఆహారాల పరిమాణం పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీరు తక్కువ అన్నాన్ని తింటారు. కార్బోహైడ్రేట్స్ కూడా అప్పుడు శరీరంలో తక్కువే చేరుతాయి. మీరు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

కాబట్టి తెల్ల అన్నాన్ని బరువు పెరుగుతామని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని పూర్తిగా తినడం మానేసే కన్నా ఇలా రకరకాల పద్ధతుల్లో తింటే పొట్ట నిండడంతో పాటు కావలసిన పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కూడా. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి. మీకు కచ్చితంగా మంచి ఫలితాలు కనబడతాయి.

Whats_app_banner