Harish Rao Counter Revanth : తెలంగాణ ప్రజలు కోల్పోయింది ఇవే.. రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్!-former minister harish rao counters chief minister revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao Counter Revanth : తెలంగాణ ప్రజలు కోల్పోయింది ఇవే.. రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్!

Harish Rao Counter Revanth : తెలంగాణ ప్రజలు కోల్పోయింది ఇవే.. రేవంత్‌కు హరీష్ రావు కౌంటర్!

Basani Shiva Kumar HT Telugu
Nov 12, 2024 02:43 PM IST

Harish Rao Counter Revanth : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ నడుస్తోంది. ఇటీవల కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు సోమవారం సీఎం రేవంత్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు ఎన్‌కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఏమన్నారో ఓసారి చూద్దాం.

హరీష్ రావు
హరీష్ రావు

పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద ఒట్టు వేసి మాట తప్పారని.. మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎంతో భక్తితో ప్రజలు రాజరాజేశ్వర స్వామిని కొలుస్తారు. కోరిన మొక్కులు చెల్లిస్తారు. అలాంటి స్వామివారి సన్నిధిలో రేవంత్ అసత్యతాలు చెప్పారు. పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టమవుతుంది. ప్రజలకు శాపం అవుతుందని హరీష్ వ్యాఖ్యానించారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు.

'రేవంత్ రెడ్డి చేసిన పాపం రాష్ట్ర ప్రజలకు శాపం కావద్దని వేములవాడ రాజన్నను మొక్కుకున్నా. జ్ఞానోదయం చేయాలని వేడుకున్నా. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు మద్దతు ధర రాక, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధర రాక దళారులకు పంట అమ్ముతున్నారు. పౌరసరఫరాల మంత్రిగా గంగుల కమలాకర్ ఉన్నప్పుడు, బిఆర్ఎస్ ప్రభుత్వం చివరి గింజ దాకా కొనుగోలు చేసింది' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

'వడ్లకు బోనస్ ఇచ్చాం అని మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు. రైతు బంధు ఎగ్గొట్టిండు, యాసంగి పంటకు అయినా ఇచ్చేలా చూడు అని దేవుణ్ణి కోరుకున్నా. దేవుళ్ల మీద ఓట్లు పెట్టిన మాట తప్పింది రేవంత్ రెడ్డి. భయం లేదు భక్తి లేదు అన్న అనుమానం వస్తున్నది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అన్నారు మాట తప్పారు. 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలి. కడితేనే రుణమాఫీ చేస్తం అన్న నిబంధన ఏమిటి' అని హరీష్ ప్రశ్నించారు.

'నువ్వు చేసే తప్పుకు రైతులు ఎందుకు శిక్ష వేశావు. రుణమాఫీ పాక్షికంగా చేశావు. 31 రకాల కారణాలు చెప్పి సగానికి పైగా రుణమాఫీ జరగలేదు. తక్షణమే రుణమాఫీ చేసి దేవుడు దగ్గర వేడుకో. చెంపలు వేసుకొని రుణమాఫీ చెయ్యి. కేసీఆర్ మీద మాట్లాడే నైతికత ఉండదు.కేసీఆర్ లేకుంటే ఉద్యమం లేదు, రాష్ట్రం లేదు, నువ్వు సీఎం అయ్యే వాడివి కాదు. కేసీఆర్ అన్న మాటలో తప్పు ఏం ఉంది. మీ పాలనలో ఏం పొందారు తెలంగాణ ప్రజలు. ఏం కోల్పోయారో చెప్పడానికి నేను సిద్ధం. పొందారో చెప్పడానికి నువ్వు సిద్ధమా' అని మాజీమంత్రి సవాల్ చేశారు.

'అప్పులు, రైతుల సమస్యలు, ఆసుపత్రులు, తాగు నీరు, సాగు నీరు, కరెంట్, విద్య, వైద్యం.. ఇలా అన్ని అంశాల్లో చర్చ చేసేందుకు నేను సిద్ధం. 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. కొవిడ్ ఉన్న సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారు. పోలీసులే తమ పోలీసులను కొట్టేలా చేశావు. నేతన్నలను ఆత్మహత్యల పాలు చేస్తున్నావు. అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతను వీపులు పగిలేలా కొట్టినవు. దళిత బంధు కోల్పోయారు. గొర్రెలు కోల్పోయారు. చేప పిల్లలు కోల్పోయారు' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

'ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఎ కోల్పోయారు. శాంతిభద్రతలు కోల్పోయారు. జర్నలిస్టులు ప్రశ్నించే హక్కు కోల్పోయారు. తెలంగాణ ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు. మొత్తంగా తెలంగాణ నెంబర్ 1 స్థానం కోల్పోయింది. కేసీఅర్ పాలనలో తెలంగాణ నెంబర్ 1 ఉంటే.. రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ఇప్పటికైనా పగా, ప్రతీకారం మాను. సీనియర్లను పరిగణనలోకి తీసుకో. తెలంగాణ కోసం పోరాడింది పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ వందేళ్ల అభివృద్ధి చేస్తే, రేవంత్ ఏడాది కాకముందే వందేళ్ల వెనుకకు రాష్ట్రాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు' అని హరీష్ రావు విమర్శించారు.

Whats_app_banner