New Zealand vs England: ఆస్ట్రేలియాపై ఇండియా కూడా ఇలాగే.. ఫాలో ఆన్ ఆడినా గెలిచిన టీమ్స్ ఇవే
New Zealand vs England: ఆస్ట్రేలియాపై ఇండియా కూడా ఇలాగే గెలిచింది. ఫాలోఆన్ ఆడినా కూడా టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగు టీమ్స్ అద్భుతంగా పుంజుకొని విజయాలు సాధించాయి. ఆ టీమ్స్ ఏవో ఒకసారి చూద్దామా?
New Zealand vs England: ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఒక పరుగు తేడాతో గెలవడం చూసి క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. కళ కోల్పోతున్న టెస్ట్ క్రికెట్ లోని అసలు సిసలు మజాను అందించిందీ మ్యాచ్. సుమారు 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా కేవలం ఒక పరుగు తేడాతో గెలిచిన సందర్భం ఇది రెండోది మాత్రమే కాగా.. ఫాలో ఆన్ ఆడిన టీమ్ గెలవడం ఇది నాలుగోసారి.
ఇంతకుముందు 1894, 1981, 2001లలో కూడా ఇలా ఫాలో ఆన్ ఆడిన టీమ్స్ అద్భుతంగా పుంజుకొని విజయాలు సాధించాయి. అందులో ఇండియన్ టీమ్ కూడా ఉంది. 2001లో ఆస్ట్రేలియాపై లక్ష్మణ్, ద్రవిడ్ పోరాటంతో ఎవరూ ఊహించని విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి ఆ నాలుగు సందర్భాలు ఏవో ఒకసారి చూసేద్దాం.
1894: ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా
టెస్ట్ క్రికెట్ లో ఇలా ఫాలో ఆన్ ఆడి గెలిచిన తొలి టీమ్ ఇంగ్లండ్. యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన టెస్ట్ లో ఇంగ్లండ్ ఫాలో ఆన్ ఆడి మరీ చివరికి 10 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 586 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ 325 రన్స్ కే పరిమితమైంది. దీంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది.
అయితే రెండో ఇన్నింగ్స్ లో పుంజుకున్న ఇంగ్లండ్ 437 రన్స్ చేసి ఆస్ట్రేలియా ముందు 177 రన్స్ టార్గెట్ విధించింది. కానీ స్వదేశంలో ఆడినా కూడా ఆస్ట్రేలియా 166 రన్స్ కే ఆలౌటైంది. ఇంగ్లండ్ పది పరుగుల తేడాతో గెలిచింది.
1981: ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా
87 ఏళ్ల తర్వాత మరోసారి ఆస్ట్రేలియాపైనే ఇదే ఫీట్ రిపీట్ చేసింది ఇంగ్లండ్. 1981లో లీడ్స్ లో జరిగిన టెస్టులో ఫాలో ఆన్ ఆడి మరీ గెలిచింది. ఈ మ్యాచ్ లో మొదట ఆస్ట్రేలియా 401 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ 174 రన్స్ కే కుప్పకూలి ఫాలోఆన్ ఆడింది.
అయితే రెండో ఇన్నింగ్స్ లో కాస్త పోరాడి 356 రన్స్ చేయగలిగింది. ఆస్ట్రేలియా ముందు 130 రన్స్ టార్గెట్ ఉన్నా.. ఆ టీమ్ మాత్రం 111 రన్స్ కే చేతులెత్తేసింది. బాబ్ విల్లిస్ ఏకంగా 8 వికెట్లతో కంగారూల పని పట్టాడు.
2001: ఇండియా vs ఆస్ట్రేలియా
ఈసారి కూడా ఆస్ట్రేలియానే బలైంది. అయితే ప్రత్యర్థి మాత్రం మారింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన ఇండియన్ టీమ్.. ఫాలోఆన్ ఆడి మరీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో లక్ష్మణ్ (281), ద్రవిడ్ (180)ల అద్భుత పోరాటాన్ని ఏ క్రికెట్ అభిమానీ మరచిపోడు. అప్పటికే 16 వరుస విజయాలు సాధించిన ఆస్ట్రేలియా.. ముంబైలో జరిగిన తొలి టెస్టులోనూ మూడు రోజుల్లోనే గెలిచింది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 445 రన్స్ చేసింది. అయితే తర్వాత ఇండియా కేవలం 171 రన్స్ కే ఆలౌటైంది. దీంతో మరో ఆలోచన లేకుండా ఇండియాను ఫాలో ఆన్ ఆడించింది ఆస్ట్రేలియా. అయితే అదే పెద్ద తప్పిదం అవుతుందని ఊహించలేకపోయింది. లక్ష్మణ్, ద్రవిడ్ పోరాటంతో ఇండియా రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 657 రన్స్ చేసింది. 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 212 రన్స్ కే కుప్పకూలింది.
2023: న్యూజిలాండ్ vs ఇంగ్లండ్
ఇక తాజాగా ఇంగ్లండ్ ను కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించి హిస్టరీ క్రియేట్ చేసింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కూడా ఫాలోఆన్ ఆడింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 435 రన్స్ చేయగా.. న్యూజిలాండ్ 209 పరుగులకే ఆలౌటైంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో విలియమ్సన్ సెంచరీతో పుంజుకున్న న్యూజిలాండ్.. 483 రన్స్ చేసి ఇంగ్లండ్ ముందు 258 పరుగుల లక్ష్యం విధించింది.
చేజింగ్ లో ఇంగ్లండ్ చివరి వరకూ పోరాడినా.. ఒక పరుగు దూరంలో నిలిచిపోయింది. విజయానికి మరో రెండు పరుగులు అవసరం కాగా.. వాగ్నర్ (4/62) బౌలింగ్ లో ఆండర్సన్ (4) ఔట్ అవడంతో న్యూజిలాండ్ చారిత్రక విజయం సాధించింది. జో రూట్ (95), స్టోక్స్ (33) పోరాడినా ఫలితం లేకపోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా ఫాలోఆన్ ఆడుతూ గెలిచిన నాలుగో టీమ్ గా, ఒక పరుగు తేడాతో గెలిచిన రెండో టీమ్ గా న్యూజిలాండ్ నిలిచింది.
సంబంధిత కథనం