England vs New Zealand: టీ20.. టెస్టా..? ఇంగ్లాండ్‌పై ఒక్క పరుగు తేడాతో కివీస్ చారిత్రక విజయం-neil wagner shines as new zealand pull off historic one run win over england ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  England Vs New Zealand: టీ20.. టెస్టా..? ఇంగ్లాండ్‌పై ఒక్క పరుగు తేడాతో కివీస్ చారిత్రక విజయం

England vs New Zealand: టీ20.. టెస్టా..? ఇంగ్లాండ్‌పై ఒక్క పరుగు తేడాతో కివీస్ చారిత్రక విజయం

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 08:09 PM IST

England vs New Zealand: ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో కివీస్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. కివీస్ బౌలర్ నీల్ వాగ్నర్ అద్భుతమే చేశాడు.

ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ విజయం
ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ విజయం (AP)

న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య సాగిన రెండో టెస్టు ఉత్కంఠభరితంగా సాగింది. టీ20 తరహాలో చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా విజయం దోబుచులాడింది. టెస్టుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ కలుగిస్తుందనే అనుభూతిని పంచింది. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి అదరగొట్టింది. అతి తక్కువ మార్జిన్‌తో విజయం సాధించిన రెండో జట్టుగా కివీస్ నిలిచింది. ఇంగ్లాండ్ విజయానికి 258 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 256 పరుగులకు ఆలౌటైంది. ఫలితం న్యూజిలాండ్‌ను విజయం వరించింది. కివీస్ బౌలర్ వాగ్నర్ చివరి వికెట్‌గా జేమ్స్ అండర్సన్‌ను ఔట్ చేయడంతో కివీస్ శిబిరంలో విజయం వెల్లివెరిసింది.

258 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు శుభారంభమేమి దక్కలేదు. ఆరంభంలోనే ఓపెనర్ జార్క్ క్రాలీని సౌథీ బౌల్డ్ చేయగా.. అనంతరం కాసేపటికే ఓలీ రాబిన్సన్ కూడా పెవిలియన్ చేరాడు. స్వల్ప వ్యవధిలోనే బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ కూడా ఔట్ కావడంతో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లాండ్. ఇలాంటి సమయంలో జో రూట్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 95 పరుగుల అద్భుత అర్దశతకతంతో ఇంగ్లీష్ జట్టును గెలుపు దిశగా కొనసాగించాడు.

బెన్ స్టోక్స్(33), ఫోక్స్ సాయంతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా స్టోక్స్‌తో కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రూట్. అయితే నిలకడగా ఆడుతున్న స్టోక్స్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు వాగ్నర్. తదుపరి ఓవర్‌లోనే రూట్‌ను కూడా పెవిలియన్ పంపాడు. విజయానికి ఇంకా 40 పరుగులు అవసరం కాగా.. చివర్లో ఫోక్స్(35) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. దాదాపు విజయం వరకు తీసుకెళ్లాడు. ఇంగ్లాండ్ గెలుపు ఇంక లాంఛనమే అనుకున్న తరుణంలో సౌథీ ఫోక్స్‌ను ఔట్ చేశాడు. చివర్లో జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్ ఉండగా.. విజయానికి మరో రెండు పరుగులు అవసరమయ్యాయి. అలాంటి సమయంలో మళ్లీ బౌలింగ్‌కు కొచ్చిన నీల్ వాగ్నర్ తొలి బంతికి డాట్ చేశాడు. రెండో బంతికి జేమ్స్ అండర్సన్‌ను ఔట్ చేయడంతో న్యూజిలాండ్‌కు విజయం దక్కింది.

30 ఏళ్ల రికార్డు బ్రేక్..

అతి తక్కువ మార్జిన్‌తో విజయం సాధించిన రెండో జట్టుగా కివీస్ నిలిచింది. చివరగా 1993లో వెస్టిండీస్ ఒక్క పరుగుతో తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. తాజాగా ఆ రికార్డును న్యూజిలాండ్ సమం చేసింది. అంతకుముందు 2011లో ఆస్ట్రేలియాపై ఏడు పరుగుల తేడాతో, 2018లో పాక్‌పై నాలుగు పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. తాజాగా పరుగు తేడాతో గెలిచి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు నష్టపోయి 435 పరుగుల వద్ద డీక్లేర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్(186), జో రూట్(153) అద్భుత శతకాలతో విజృంభించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 209 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ సౌథీ 73 పరుగుల మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 4, జాక్, అండర్సన్ చెరో 3 వికెట్లతో రాణించారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్ ఈ సారి అదరగొట్టింది. కేన్ విలియమ్సన్(136) అద్భుత శతకంతో విజృంబించగా. టామ్ లాథమ్(83), కాన్వే(61), చివర్లో టిమ్ బ్లండెల్(90) అర్దశతకాలతో అదరగొట్టారు. ఫలితంగా 483 పరుగుల భారీ స్కోరు సాధించింది న్యూజిలాండ్. మొత్తంగా ఇంగ్లాండ్ ముందు 258 పరుగుల మెరుగైన లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లే 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్