Anil Kumble 10 Wickets Haul: అనిల్ కుంబ్లే అరుదైన ఘనతకు 24 ఏళ్లు.. అదరగొట్టిన స్పిన్నర్
Anil Kumble 10 Wickets Haul: టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చారిత్రక 10 వికెట్ల రికార్డు గుర్తుందా? 1999 ఫిబ్రవరి 7న పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో 10కి 10 వికెట్లు తీసి అదరగొట్టాడు.
Anil Kumble 10 Wickets Haul: భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్ల జాబితాలో ముందు వరుసలో నిలిచే బౌలర్ అనిల్ కుంబ్లే. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలరే కాకుండా ఎన్నో అరుదైన మైలురాళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 1999లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 10కి 10 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. నేటితో ఈ మహత్కర ఘట్టం పూర్తయి 24 ఏళ్లు కావస్తుంది. కుంబ్లే కంటే ముందు 1956లో ఇంగ్లీష్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ 53 పరుగులిచ్చి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జిమ్ తర్వాత అంతటి అద్భుత గణాంకాలను కుంబ్లే నమోదు చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
పూర్తి వివరాల్లోకి వెళ్తే 1999 ఫిబ్రవరి 7వ తేదీన రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో టీమిండియా తలపడుంది. చివరిదైన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 172 పరుగులకు ఆలౌటైంది. అనిల్ కుంబ్లే 4 వికెట్లతో ఆకట్టుకోగా.. హర్భజన్ సింగ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 339 పరుగులు చేసింది. దీంతో 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనంలో బరిలోకి దిగిన పాకిస్థాన్ కుంబ్లే ధాటికి విలవిల్లాడింది.
ఈ భారీ లక్ష్య ఛేదనంలో పాక్ ఓపెనర్లు షాహీద్ అఫ్రీది, సయిద్ అన్వర్ 101 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి లక్ష్యం దిశగా పరుగులు తీశారు. ఇలాంటి సమయంలో అనిల్ కుంబ్లే అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 74 పరుగులిచ్చి 10కి 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు కుంబ్లే. చివరకు భారత్ 212 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ విషయంపై అనిల్ కుంబ్లే పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. టీ బ్రేక్ తర్వాత అప్పుడే వచ్చాను. ఎందుకంటే లంచ్ నుంచి బ్రేక్ వరకు నేను నిరంతరం బౌలింగ్ చేశాను. నా మునుపటి బెస్ట్ 7 వికెట్ల రికార్డును అధిగమిద్దామనే అనుకున్నాను. ఏడో వికెట్ పడిన తర్వాత 9, 9 వికెట్లు కేవలం రెండు డెలివరీల్లోనే సాధ్యమైంది. అప్పుడు నా సహచురల దగ్గరకొచ్చి అవకాశముంటే 10 మంది వికెట్లు తీయమని చెప్పారు. అని కుంబ్లే చెప్పారు.