Harbhajan on Jadeja: జడ్డూను వైస్ కెప్టెన్ చేయాలి.. హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Harbhajan on Jadeja: టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ రవీంద్ర జడేజాపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడికి టెస్టు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని సలహా ఇచ్చాడు. అతడు అద్భుతంగా రాణిస్తున్నాడని స్పష్టం చేశాడు.
Harbhajan on Jadeja: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది భారత్. చాలా కాలం గ్యాప్ తర్వాత రవీంద్ర జడేజా తనదైన శైలి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు టెస్టుల్లోనూ మెరుగ్గా రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా అతడికి టెస్టు వైస్ కెప్టెన్సీ కూడా అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఈ విషయంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రోహిత్ శర్మకు డిప్యూటీగా జడ్డూకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా నియమించాలని స్పష్టం చేశాడు.
"భారత్‌కు వైస్ కెప్టెన్ లేడు. మరి ఆ పోస్టులో ఎవరిని ఉంచాలి? నా వరకైతే జట్టు కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ స్టార్టర్‌గా ఉండాలి. అది స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా కచ్చితంగా రాణించేవాడై ఉండాలని అనుకుంటున్నాను. అలాంటి ఆటగాడు రవీంద్ర జడేజా అని భావిస్తున్నాను. ఇప్పుడు వైస్ కెప్టెన్సీని అతడికి ఇవ్వాలి. ఎందుకంటే అది అతడిలో మరింత బాధ్యతను పెంపొందిస్తుంది. జడ్డూ చాలా బాగా ఆడుతున్నాడు. అంతేకాకుండా చాలా కాలంగా జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తన సామర్థ్యం మేరకు గరిష్ఠ స్థాయిలో ఆడుతున్నాడు." అని హర్భజన్ పేర్కొన్నాడు.
"ప్రస్తుతం ప్రపంచంలో రవీంద్ర జడేజా కంటే మెరుగైన ఆల్ రౌండర్ ఉన్నాడని నేను అనుకోను. బెన్ స్టోక్స్ లాంటి అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. జడ్డూ ప్రదర్శన చూస్తే అతడి బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ స్కోరు చేస్తున్నాడు. కాబట్టి టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ పదవీని జడేజాకు ఇవ్వడం మంచిదని నేను అనుకుంటున్నాను." అని హర్భజన్ స్పష్టం చేశాడు.
మోకాలి గాయం కారణంగా దాదాపు 5 నెలల నుంచి జడేజా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆసియా కప్‌లో గాయపడ్డ అతడు అనంతరం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. పునరాగమనం గురించి తొందరపడకుండా తగినంత సమయం తీసుకుని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ టోర్నీ కంటే ముందు చెన్నైలో జరిగిన రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు వరకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. అయితే అతడి పేలవ ప్రదర్శన కారణంగా అతడి స్థానం సందిగ్ధంలో పడింది. అంతేకాకుండా తదుపరి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్‌గా అతడి పేరును సూచించకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది.