Cocopeat Business : కొబ్బరి పీచే కదా అని తేలిగ్గా తీసేయకండి.. కోట్ల విలువ చేసే బిజినెస్ ఇది!
Cocopeat Business : కొబ్బరికాయను వలిచి తీసిన తర్వాత కొబ్బరి పీచును తీసి ఎక్కడో పడేస్తాం. కానీ ఇది కూడా చాలా పెద్ద బిజినెస్ అనేక రకాలుగా దీనిని ఉపయోగిస్తారు. కోకోపీట్‌తో ఓ వ్యక్తి పెద్ద వ్యాపారాన్ని సృష్టించాడు. ఆ వివరాలేంటో చూద్దాం..
పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. పేదవాడిగా చనిపోవడం తప్పు అంటారు. తినడానికి తిండి లేని ఇంట్లో పుట్టినవారు కూడా ఇప్పుడు కోట్లలో సంపాదించేవారు ఉన్నారు. కొందరు పర్యావరణానికి హాని కలిగించే విధంగా వ్యాపారం చేస్తారు. మరికొందరు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వ్యాపారంలో ముందుకు వెళ్తారు. చెన్నైకి చెందిన అనీస్ అహ్మద్ కూడా కోకోపీట్‌తో వ్యాపారం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
కోకో పీట్ అనేది కొబ్బరి పొట్టుతో తయారుచేసే సహజమైన పదార్థం. దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. మార్కెట్‌లో దీనికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఇది రగ్గులు, తాడులు, బ్రష్‌లను కూడా తయారుచేసేందుకు వాడుతారు. మెుక్కలకు కూడా దీనిని ఉపయోగిస్తారు. ఇది సహజ ఉత్పత్తికావడంతో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు.
తమిళనాడుకు చెందిన అనీస్ అహ్మత్ ఈ వ్యాపారాన్నే చేస్తున్నాడు. బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన అహ్మద్‌కు కొబ్బరి పీచుపై ఎప్పుడూ ఆసక్తి ఉండేది. ఇప్పుడు కొబ్బరి పీచుతో వివిధ ఉత్పత్తులను తయారు చేస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. కొబ్బరి పీచును సాధారణంగా వ్యర్థంగా పరిగణిస్తారు.
కానీ నేడు కోకో పీట్‌ను గ్రీన్‌హౌస్‌లు, నర్సరీలు, ఇండోర్ గార్డెనింగ్ వంటి వివిధ రంగాలలో ఉపయోగిస్తున్నారు. డచ్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కోకో పిట్ అధిక నీటిని పట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వాయువు, pH, తటస్థ లక్షణాలు, వ్యాధి నిరోధకత లక్షణాలతో వ్యవసాయ కార్యకలాపాలకు అనువైనవి. దీని గురించి తెలుసుకున్న అహ్మద్ 2012లో చెన్నైలో గ్లోబల్ గ్రీన్ కోయిర్‌ను ప్రారంభించారు.
కుండలు, ఇటుకలు, దిమ్మెలు, గ్రో బ్యాగ్‌లు వంటి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు కూడా ఈ కోకో పీట్ వాడుతారు. ప్రస్తుతం అనీస్ కొబ్బరీ పొట్టుతో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులు అంతర్జాతీయంగా కూడా ఎగుమతి చేస్తున్నారు.
అహ్మద్‌కు చిన్నతనం నుండి ప్రకృతి, తోటపని అంటే చాలా ఇష్టం. తన ఇంటికి సమీపంలోని తోటలో కూరగాయలు, పండ్లు పండించేవాడు. కొబ్బరి అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెరగడం, అతని తండ్రి పరిశ్రమలో పనిచేస్తున్నందున కొబ్బరీ పీచుపై ఎప్పుడూ ఆసక్తి ఉండేది.
తాను వ్యాపారం ప్రారంభించాలనుకోలేదని, కానీ అనేక విషయాలు తనను ఆ దిశగా నడిపించాయని అహ్మద్ చెబుతారు. కోకో పీట్ అధ్యయనం చేస్తున్నప్పుడు నేలలో పోషకాలను ఉంచడానికి అనేక దేశాలు కోకో పీట్‌ను మూలవస్తువుగా ఉపయోగిస్తాయని కనుగొన్నారు. తర్వాత వ్యాపారం మెుదలుపెట్టి కొబ్బరి పీచుతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు.
ప్రారంభ దశలో అహ్మద్ తన ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పుడు కోకో పీట్‌కు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదు. కానీ తర్వాత కోకో పీట్ భారతదేశంలో పెద్ద మార్కెట్‌గా మారింది. చాలా మంది ప్రజలు నెమ్మదిగా ఈ ఉత్పత్తికి అలవాటు పడుతున్నారని అహ్మద్ అన్నారు.
కోకో పీట్ అంటే
కొబ్బరి పొట్టు నుంచి తయారైన ఉత్పత్తి. సాంప్రదాయ మట్టికి ప్రత్యామ్నాయంగా కూడా వాడుతారు. నీరు, పోషకాలను నిలుపుకోవడం ద్వారా మొక్కల పెరుగుదలను ఉపయోగపడుతుంది. వ్యర్థాలుగా పరిగణించే కోకో పీట్ ఉపయోగాన్ని 1990ల చివరలో డచ్ ఆవిష్కర్తలు మొదట గుర్తించారు. కుండలు, గ్రో బ్యాగ్‌లు, ఇటుకలు వంటి ఉత్పత్తులను తయారు చేయడంలో కోకో పీట్ వాడుతున్నారు. వీటన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉంది.