Adilabad : వడ్ల గింజలు తిని 64 గొర్రెలు మృతి.. ఆర్థిక సాయం ప్రకటించిన కలెక్టర్-64 sheep die after eating paddy in adilabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad : వడ్ల గింజలు తిని 64 గొర్రెలు మృతి.. ఆర్థిక సాయం ప్రకటించిన కలెక్టర్

Adilabad : వడ్ల గింజలు తిని 64 గొర్రెలు మృతి.. ఆర్థిక సాయం ప్రకటించిన కలెక్టర్

HT Telugu Desk HT Telugu
Nov 26, 2024 01:06 PM IST

Adilabad : మేతకు వెళ్లిన గొర్రెలు వడ్ల గింజలు తిన్నాయి. వడ్ల గింజలు తిని 64 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండంలో జరిగింది. గొర్రెలు మృతిచెందడంతో పెంపకందారులు నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు కలెక్టర్ సాయం ప్రకటించారు.

గొర్రెలు మృతి
గొర్రెలు మృతి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామానికి చెందిన కాపరులు.. గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాలకు గొర్రెలను మేతకు తీసుకువెళ్లారు. మేతకు వెళ్లి వచ్చిన తర్వాత ఒకొక్కటిగా చనిపోతున్నాయి. దీంతో కాపలాదారులు పశు వైద్యాధికారిణి డాక్టర్ శాంతిరేఖకు సమాచారం ఇచ్చారు. ఆమె గొర్రెలకు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.

మొత్తం 64 గొర్రెలు మృతి చెందాయి. మరో 10 గొర్రెలకు పైగా పరిస్థితి విషమంగా ఉంది. నంనూరుకు చెందిన గోపు రాజ్ కుమార్‌కు చెందిన 17, గోపు కొమరయ్యకు చెందిన 16, గోపు మల్లేశంకు చెందిన 16 గొర్రెలు, గోపు రమేశ్‌కు చెందిన 15 గొర్రెలు చనిపోయాయి. చనిపోయిన గొర్రెలకు డాక్టర్ శాంతిరేఖ పోస్టుమార్టం నిర్వహించారు. ఆ గొర్రెలు అన్నీ వడ్ల గింజలు అధిక మొత్తంలో తిన్న కారణంగా చనిపోయినట్లు ధ్రువీకరించారు.

చనిపోయిన మొత్తం గొర్రెల విలువ సుమారు రూ. 6 లక్షల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ స్పందించి.. ఆర్థిక సాయం ప్రకటించారు. చనిపోయిన ఒక్కో గొర్రెకు రూ.2 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. అటు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ కూడా తనవంతు సాయంగా.. ఒక్కో గొర్రెకు వెయ్యి రూపాయలు ప్రకటించారు.

జాగ్రత్తలు పాటించాలి..

పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని పశు వైద్య అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం అయ్యాయని.. వడ్ల గింజలు తినకుండా కాపలాదారులు జాగ్రత్తలు తీసుకోవాలి స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వడ్ల గింజలు తిన్నాయని గుర్తిస్తే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్- వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner