Harbhajan on KL Rahul: రాహుల్ కూడా మనిషే.. మరీ అంతగా విమర్శలు వద్దు: హర్భజన్
Harbhajan on KL Rahul: రాహుల్ కూడా మనిషే.. మరీ అంతగా విమర్శలు వద్దని అంటున్నాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. కేఎల్ రాహుల్ దారుణమైన ఫామ్ పై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
Harbhajan on KL Rahul: ఇండియన్ టీమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ పై కొంతకాలంగా విపరీతమైన చర్చ జరుగుతున్న విషయం తెలుసు కదా. ఇదే విషయంపై మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రా మధ్య మాటల యుద్దం కూడా నడిచింది. ఇప్పటికే వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రాహుల్.. మూడో టెస్టులో తుది జట్టులో స్థానం కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. రాహుల్ కు మద్దతుగా నిలిచాడు. తన యూట్యూబ్ షోలో అతడు మాట్లాడుతూ.. అభిప్రాయాలు చెప్పడం ఓకే కానీ.. ఓ ప్లేయర్ కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్పష్టం చేశాడు. రాహుల్ లక్ష్యంగా వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే అతన్ని కావాలనే లక్ష్యం చేసుకున్నావంటూ ప్రసాద్ తో ఆకాశ్ చోప్రా మాటల యుద్ధానికి దిగాడు.
"ఏ ప్లేయర్ అయినా సరిగా ఆడకపోతే మొదట ఫీలయ్యేది ఆ ప్లేయర్, అతని కుటుంబ సభ్యులే. మనకు ఈ క్రికెటర్లు అంటే చాలా ఇష్టం. మీ కోపమే వాళ్లపై మీకున్న ప్రేమకు నిదర్శనం. కానీ మరీ ప్లేయర్స్ మెంటాలిటీ దెబ్బ తినేలా విమర్శలు చేయకూడదు" అని భజ్జీ అన్నాడు.
"కేఎల్ రాహుల్ స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్లు? అతడు పరుగులు చేయడానికి ప్రయత్నించడం లేదని అనుకుంటున్నారా? ఇండియాకు అతడు అద్భుతమైన ప్లేయర్. అతడు కచ్చితంగా మళ్లీ గాడిలో పడతాడు. సోషల్ మీడియాలో అందరం మన అభిప్రాయాలు చెబుతున్నాం. అంత వరకూ సరే కానీ మరీ అతన్ని లక్ష్యంగా చేసుకోవద్దు. అతడు కూడా మనిషే. మంచిగా ఆడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్లేయర్స్ గా ఉన్న వాళ్లు కూడా ఆ దృక్పథంతో చూడండి" అని భజ్జీ కోరాడు.
రాహుల్ లాంటి నైపుణ్యం ఉన్న ఆటగాడికి ఈ కష్టకాలంలో అందరూ అండగా ఉండాలని అన్నాడు. "గవాస్కర్ సర్ టైమే కాదు అంతకుముందు, ఆ తర్వాత కూడా ఒక్క ప్లేయర్ ను చూపించండి. ఇలాంటి దశను ఎదుర్కోని ఒక్క ప్లేయర్ అయినా ఉన్నాడా? రన్స్ స్కోరు చేయకుండా, వికెట్లు తీయకుండా ఇబ్బంది పడలేదా? ఇలాంటి క్లిష్ట దశలో ప్లేయర్ తనను తాను అర్థం చేసుకొని, ఎక్కడ తప్పు జరుగుతోందో చూడాలి" అని హర్బజన్ అన్నాడు.
సంబంధిత కథనం