TGSRTC Drivers Recruitment : టీజీఎస్ ఆర్టీసీకి డ్రైవర్లు కావలెను.. నియామకానికి అధికారుల వినూత్న ఆలోచన!
TGSRTC Drivers Recruitment : టీజీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉంది. ముఖ్యంగా డ్రైవర్ల కొరత వేధిస్తోంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ఒప్పంద పద్ధతిలో నియమించిన సిబ్బందితో సంస్థ బస్సులు నడుపుతోంది. ఇంకా డ్రైవర్ల కావాల్సి రావడంతో.. అధికారులు వినూత్నంగా ఆలోచించారు.
హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చింది. ప్రయాణికుల నుంచి స్పందన బాగానే ఉంది. ఇక్కడిదాకా ఏ సమస్య లేదు. కానీ.. ఆ ఎలక్ట్రిక్ బస్సులు నడిపే డ్రైవర్లే లేరు. అనుభవం ఉన్న డ్రైవర్లే వీటిని నడపగలరు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైవర్లు కావాలంటూ ప్రకటన బోర్డులను ఏర్పాటు చేశారు. డ్రైవర్లు కావలెను అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తెలంగాణ సైనిక సంక్షేమశాఖ.. టీజీఎస్ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని 1201 డ్రైవర్ పోస్టులకు సైనిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైనా వారికి నెలకు రూ.26 వేల వేతనం, రోజు వారి అలవెన్స్ రూ.150 చెల్లించనున్నారు.
డ్రైవర్లపై ఒత్తిడి..
తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంస్థలో చాలావరకు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. దీనికి తోడు సంస్థలో భారీగా ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయడం లేదు. రద్దీని తగ్గించడానికి బస్సుల్ని అదనపు కిలోమీటర్లు తిప్పుతున్నారు. దీంతో డ్రైవర్లు చాలామంది ఒక డ్యూటీ అయిపోగానే కాస్త విరామం తర్వాత రెండో డ్యూటీ చేస్తున్నారు. ఇలా ఒక రోజులో దాదాపు 14 గంటలు విధుల్లో ఉంటున్నామని కొందరు డ్రైవర్లు చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా అలిసిపోతున్నామని.. ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు,
8 గంటలే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రైవర్ 8 గంటలు బస్సు నడపాలి. కానీ.. తెలంగాణలో మాత్రం కొన్నిచోట్ల 14 గంటల వరకు బస్సులు నడుపుతున్నారు. ప్రస్తుతం సంస్థలో దాదాపు 600 వరకు డ్రైవర్ల కొరత ఉన్నట్టు సమాచారం. వారు చేసే పనిని కూడా ప్రస్తుతం ఉన్న డ్రైవర్లతో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా ఇప్పుడున్న డ్రైవర్లపై ఒత్తడి పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టాలని.. ఆర్టీసీ యూనియన్ నేతలు కోరుతున్నారు.