TGSRTC : ఆర్టీసీ సిబ్బంది ఉదారత.. సరైన సమయంలో స్పందించిన బస్ డ్రైవర్, కండక్టర్
TGSRTC : ఆర్టీసీ బస్సుల్లో రోజుకు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వారిలో చాలామందికి బస్సు ప్రయాణం పడదు. దీంతో అస్వస్థతకు గురవుతారు. అలాంటి సాధారణంగా సిబ్బంది పట్టించుకోరు. కానీ.. తాజా ఓ మహిళ బస్సులో అస్వస్థతకు గురైతే.. బస్ డ్రైవర్, కండక్టర్ వెంటనే స్పందించారు. మహిళను ఆస్పత్రికి తరలించారు.
బస్సులో తీవ్ర అవస్థకు గురైన ప్రయాణికురాలిని ఆర్టీసి సిబ్బంది సకాలంలో ఆస్పత్రికి తరలించారు. తమ ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్- కల్వకుర్తి రూట్‌లో ఆదివారం ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఆ బస్సులో నందిని అనే మహిళా ప్రయాణిస్తున్నారు. బస్సు తుక్కుగూడ సమీపంలోకి రాగానే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.
ఈ విషయాన్ని గమనించిన కల్వకుర్తి డిపో కండక్టర్ శశికళ.. డ్రైవర్ అంజయ్యను అప్రమత్తం చేశారు. బస్సును ఆపించి అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో నందినిని కడ్తాల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రయాణికురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బస్సులో కడుపు నొప్పితో బాధపడుతున్న ప్రయాణికురాలికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకున్న కల్వకుర్తి డిపో కండక్టర్ శశికళ, డ్రైవర్ అంజయ్యను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జానర్ ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు మానవత్వం చాటుకోవడంలోనూ తామేమీ తక్కువ కాదని.. ఆర్టీసీ సిబ్బంది నిరూపిస్తుండటం సంతోషదాయకమని ట్వీట్ చేశారు.
బస్సులో ప్రసవం..
ఇటీవల కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట నుంచి కోదాడకు బయలుదేరింది. అందులో గుడిబండ గ్రామానికి చెందిన అలివేలు అనే గర్భిణి ప్రయాణిస్తోంది. బస్సు మునగాల మండలం తాడ్వాయి వద్దకు రాగానే ఒక్కసారిగా అలివేలుకు పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను గమనించిన కండక్టర్ వి.నరేశ్ బాబు అప్రమత్తమై.. డ్రైవర్ నరేశ్‌కు చెప్పి బస్సును వెంటనే ఆపించాడు. అంబులెన్స్ కోసం 108కు కాల్ చేశారు.
అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే.. నొప్పులు ఎక్కువ అయ్యాయి. బస్సులోని తోటి మహిళా ప్రయాణికులు మానవత్వంతో మందుకొచ్చారు. అలివేలుకు బస్సులోనే పురుడుపోశారు. అలివేడు పండంటి ఆడ శిశువుకు జన్మించింది. ఆ సమయానికి అంబులెన్స్ కూడా రావటంతో.. తల్లీబిడ్డలను అంబులెన్స్ సాయంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఇటీవలే.. రాఖీ పండుగ రోజున గద్వాల డిపోకు చెందిన గద్వాల- వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి మహిళా కండక్టరే ప్రసవం చేసింది. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న మరో నర్సుతో కలిసి ప్రసవం చేశారు.