Medak Crime : డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ-medak constable house looted thieves 8 tola gold silver stolen ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Crime : డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ

Medak Crime : డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ

HT Telugu Desk HT Telugu
Oct 30, 2024 10:34 PM IST

Medak Crime : విధులకు వెళ్లొచ్చే లోగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇల్లు గుల్ల చేశారు దొంగలు. తాళం పగలగొట్టి ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో జరిగింది.

డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ
డ్యూటీకి వెళ్లొచ్చేలోగా కానిస్టేబుల్ ఇల్లు గుల్ల- ఎనిమిదిన్నర తులాల బంగారం, 30 తులాల వెండి చోరీ

సామాన్య మనుషుల ఇండ్లకు భద్రత దేవుడెరుకు, కానీ పోలీసుల ఇండ్లకే రక్షణ లేకుండా పోయింది. భార్యాపిల్లలు స్వగ్రామానికి వెళ్లగా, ఇంటికి తాళం వేసుకొని విధులకు వెళ్లొచ్చే లోగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇల్లు గుల్లయింది. అది చూసిన కానిస్టేబుల్ అతాశుడైనాడు. ఇంటి తాళాలు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో చోటుచేసుకుంది.

yearly horoscope entry point

పెద్దశంకరంపేట మండలంలోని రామోజిపల్లి గ్రామానికి చెందిన దంతెల సీమాన్ అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడే శ్రీ వెంకటేశ్వర కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా సోమవారం కుటుంబసభ్యులు స్వగ్రామానికి వెళ్లారు. దీంతో సీమాన్ ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లాడు. అనంతరం మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి ముందర తాళాలు పగలగొట్టి తలుపులు వేసి ఉన్నాయి. లోపలకి వెళ్లి చూసేసరికి బెడ్ రూమ్ లోని బీరువా తాళం పగలగొట్టి, అందులో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించాడు.

బంగారం, వెండి అపహరణ

బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు నాను, మూడు తులాల పుస్తెలతాడు, ఒక తులం బుట్ట కమ్మలు, అర తులం బంగారు కమ్మలు, మొత్తం ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులతో పాటు రూ. 15 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి, పేట ఎస్ఐ శంకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితుడు సీమాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా నేరాలు అదుపు చేయవచ్చని, దొంగతనాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి సులువుగా పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ఇంతకుముందు ఎన్నో నేరాలు అరికట్టడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలు 24 గంటలు ప్రజలకు మరింత రక్షణగా నిలుస్తాయన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, వాటి ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలన్నారు. బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని తెలిపారు.

Whats_app_banner