Varahi devi: మీ ఇంట్లో ఉన్న సమస్యలు, అప్పుల బాధలు తీరిపోవాలంటే వారాహి దేవి పూజ ఇలా చేయండి చాలు-if you want to get rid of the problems and debts in your house just do this varahi devi puja ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Varahi Devi: మీ ఇంట్లో ఉన్న సమస్యలు, అప్పుల బాధలు తీరిపోవాలంటే వారాహి దేవి పూజ ఇలా చేయండి చాలు

Varahi devi: మీ ఇంట్లో ఉన్న సమస్యలు, అప్పుల బాధలు తీరిపోవాలంటే వారాహి దేవి పూజ ఇలా చేయండి చాలు

Haritha Chappa HT Telugu

Varahi devi: బాధలను అంతం చేసే శక్తి కొంతమంది దేవతలకు మాత్రమే ఉంటుంది. అలాంటి దేవతల్లో వారాహి దేవి ఒకరు. వారాహి దేవిని పూజించడం ద్వారా ఇల్లును ప్రశాంతంగా మార్చుకోవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.

వారాహి దేవి

హిందూమత ఆచారాల ప్రకారం ఒక్కొక్క దేవతకి ఒక్కో శక్తి ఉంటుంది. మీకు కావాల్సిన ఫలితాన్ని బట్టి ఆ దేవతను పూజించడం ద్వారా కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఎంతోమందికి ఇంట్లో రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలు వెంటాడుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతారు. అలాంటి వారు ఆర్థికంగా విజయం సాధించాలంటే ఏం చేయాలో, ఎలాంటి పూజలు చేయాలో తెలియక ఇబ్బందులు పడతారు. వారు వారాహి దేవిని ప్రార్థించడం ఉత్తమమైన మార్గం. వారాహి దేవిని తరచూ పూజిస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న బాధలు సమస్యలు తొలగిపోవడమే కాదు, ఆర్థికంగా కూడా మీరు బలపడతారు.

వారాహి దేవి ఎల్లప్పుడూ తన భక్తులు పట్ల ప్రేమ, అనురాగాలతో ఉంటుంది. ఆమెను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరిన కోర్తులన్నీ తీరుస్తుంది. రాక్షస రాజైన హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహుడు ఉగ్రరూపంలో విపరీతమైన కోపంతో ఉంటాడు. ఆమె ఆయనను శాంతింపచేయడానికి వారాహి దేవి అవతరించిందని పురాణాలు చెబుతాయి. ఆమె నరసింహస్వామి ఒడిలో కూర్చుని శాంతించేలా చేసిందని తిరిగి స్వర్గానికి తీసుకొచ్చిందని నమ్ముతారు.

మీరు భక్తిశ్రద్ధలతో వారాహి దేవుని పూజిస్తే మీ ప్రార్థనలన్నీ ఆమె వింటుంది. ఇతరులకు హాని చేయాలని కోరుకుంటే మాత్రం అది నెరవేరదు. వారాహి మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీ జీవితంలో, మీ పనుల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆమె శ్రేయస్సును, సంపదను అందించే దేవత.

వారాహి దేవిని ఇలా పూజించండి

వారాహి దేవతను పూజించేందుకు ఆ పూజగదిని పూలతో అలంకరించండి. నీలిరంగు వస్త్రాన్ని తీసుకొచ్చి చతురస్రాకారంలో కత్తిరించండి. ఆ చతురస్రాకారపు వస్త్రంలో తెల్లని ఆవాలు వేసి చిన్న మూటలా కట్టాలి. నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి పూజ చేయాలి.

వారాహి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి శనివారం పూజ చేస్తే మంచిది. ఈ పూజా ఉదయం 6 నుండి సాయంత్రం ఏడు గంటల లోపు చేస్తే ఉత్తమం. ఈ పూజను వరుసగా ఎనిమిది శనివారాల పాటు చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఈ పూజ చేయలేని వారు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఈ పూజను చేసుకోవచ్చు.

ఈ వారాహి దేవి పూజను చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న శత్రువులు కూడా మిత్రువులుగా మారిపోతారు. వారాహి దేవి మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. మీ ఇంట్లోని బాధలను పోగొడుతుంది. జీవితంలో సంపాదన తెస్తుంది. డబ్బు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. వారాహి దేవి అనుగ్రహం పొందితే మిమ్మల్ని వేధించే ఏ సమస్య అయినా దూరమైపోతుంది.

ఓం ఐం హ్రీమ్ శ్రీమ్

ఐం గ్లౌం ఐం

నమో భగవతీ

వార్తాళి వార్తాళి

వారాహి వారాహి

వరాహముఖి వరాహముఖి

అన్ధే అన్ధిని నమః

రున్ధే రున్ధిని నమః

జమ్భే జమ్భిని నమః

మోహే మోహిని నమః

స్తంభే స్తంబిని నమః

సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్

సర్వ వాక్ సిద్ధ సక్చుర్

ముఖగతి జిహ్వా

స్తంభనం కురు కురు

శీఘ్రం వశ్యం కురు కురు

ఐం గ్లౌం

ఠః ఠః ఠః ఠః

హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||

ఇతి శ్రీ వారాహి దేవి మూల మంత్రం ||

ఇక్కడ ఇచ్చిన వారాహి మంత్రాన్ని పూజ చేసేటప్పుడు 108 సార్లు జపించడం అలవాటు చేసుకోండి. అంత సమయం లేకపోతే కనీసం మూడుసార్లు ఈ మంత్రాన్ని జపించండి. వారాహి దేవిని పూజించేటప్పుడు లేదా వారాహి దేవి గుడికి వెళ్ళినప్పుడు కూడా ఈ మంత్రాన్ని పఠించాల్సిన అవసరం ఉంది. ఇది వారాహి దేవి మూల మంత్రం.

ఈ మంత్రం చూపిస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు, అంతరాయాలు లేకుండా చూసుకోండి. ఇక్కడ చెప్పిన విధంగా ఎనిమిది శనివారాలపాటు చేస్తే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ జీవితం మరింత సుఖమయంగా మారుతుంది.