Jasprit Bumrah: మూడు ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్: ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ బ్యాటర్
Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. బెస్ట్ బౌలర్ అంటూ పొడిగాడు. ఎప్పుడైనా అదరగొడతారని అన్నాడు. మరిన్ని కామెంట్లు చేశాడు స్మిత్.
టీమిండియాలో జస్‍ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఏ ఫార్మాట్ అయినా అద్భుతం అదరగొడుతున్నాడు. తన బౌలింగ్‍తోనే చాలా మ్యాచ్‍ల్లో భారత్‍ను గెలిపించాడు. బుమ్రాపై భారత్‍తో పాటు చాలా మంది విదేశీ ప్లేయర్లు, మాజీలు కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి వచ్చేశాడు ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. తాజాగా బుమ్రాపై స్మిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మూడు ఫార్మాట్లలో బెస్ట్
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఈ ఏడాది నవంబర్‌లో మొదలుకానుంది. ఆసీస్ గడ్డపై జరగనున్న ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి చాలా క్రేజ్ ఉంది. ఈ తరుణంలో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ కీలక కామెంట్లు చేశాడు. జస్‍ప్రీత్ బుమ్రాను ప్రశంసించాడు.
టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలో ప్రస్తుతం జస్‍ప్రీత్ బుమ్రానే ప్రపంచంలో బెస్ట్ బౌలర్ అని స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఆస్ట్రేలియా ప్లేయర్.. టీమిండియా పేసర్‌ను ఈ రేంజ్‍లో ప్రశంసించడం విశేషంగా ఉంది. “అతడో (బుమ్రా) అద్భుతమైన బౌలర్. కొత్త బాల్‍తో అయినా, కాస్త పాతబడిన బంతితో అయినా, పాత బంతితో అయినా అతడిని ఎదుర్కొనేటప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఈ అన్ని విషయాల్లో బుమ్రాకు గొప్ప స్కిల్ ఉంది” అని స్మిత్ చెప్పాడు.
బుమ్రా బెస్ట్ బౌలర్ అని, అతడిని ఎదుర్కోవడం ఎప్పుడైనా సవాలుగా ఉంటుందని స్మిత్ అన్నారు. “అతడు గొప్ప బౌలర్.. అంతేకాదు మూడు ఫార్మాట్లలో బెస్ట్ ఫాస్ట్ బౌలర్. అతడి ఎదుర్కోవడం ఎప్పుడైనా ఛాలెంజ్‍లా ఉంటుంది” అని స్మిత్ అన్నాడు.
ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో భారత్ ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి 2025 జనవరి 7 మధ్య జరగనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గత నాలుగుసార్లు టీమిండియానే కైవసం చేసుకుంది. ఇందులో రెండుసార్లు ఆసీస్ గడ్డపై సిరీస్‍లు గెలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనే కసితో ఉంది. సొంతగడ్డపై అయినా సిరీస్ గెలిచి భారత్ జోరుకు బ్రేక్ వేయాలని ఆస్ట్రేలియా తహతహలాడుతోంది. దీంతో ఈ సిరీస్‍కు క్రేజ్ నెక్స్ట్ లెవెల్‍లో ఉంది.
ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటికే జస్‍ప్రీత్ బుమ్రా రెండు టెస్టు సిరీస్‍లు ఆడాడు. ఏడు టెస్టుల్లో 32 వికెట్లతో రాణించాడు. అద్భుతమైన బంతులను వేశాడు. టీమిండియా సిరీస్‍ల గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇక, ఆసీస్‍లో మూడో సిరీస్ ఆడనున్నాడు. బుమ్రాపైనే అందరి కళ్లు ఉండనున్నాయి.
భారత్, బంగ్లా సిరీస్
భారత్ ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‍తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో బంగ్లాను టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో చిత్తుచిత్తు చేసింది. నాలుగో రోజైన సోమవారమే (సెప్టెంబర్ 23) బంగ్లాను కుప్పకూల్చి భారత్ గెలిచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో బంతితో ఆరు వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు అశ్విన్. భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సెప్టెంబర్ 27న మొదలుకానుంది.