IND vs AUS Test Series 2024: టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌కి రవిశాస్త్రి ఉచిత సలహా, అనుభవంతో చెప్పిన మాజీ కోచ్-india legend ravi shastri key message for india ahead of test series in australia ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus Test Series 2024: టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌కి రవిశాస్త్రి ఉచిత సలహా, అనుభవంతో చెప్పిన మాజీ కోచ్

IND vs AUS Test Series 2024: టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌కి రవిశాస్త్రి ఉచిత సలహా, అనుభవంతో చెప్పిన మాజీ కోచ్

Galeti Rajendra HT Telugu
Nov 18, 2024 10:33 PM IST

India vs Australia Test Series 2024: న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అనుభవపూర్వకంగా ఓ ఉచిత సలహా ఇచ్చాడు.

గౌతమ్ గంభీర్, ఇన్‌సెట్‌లో రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్, ఇన్‌సెట్‌లో రవిశాస్త్రి (X)

ఆస్ట్రేలియాతో సుదీర్ఘ టెస్టు సిరీస్ ముంగిట టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ఉచిత సలహా ఇచ్చాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబరు 22 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కి పెర్త్ ఆతిథ్యం ఇవ్వబోతుండగా.. వారం క్రితమే అక్కడికి చేరుకున్న టీమిండియా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తోంది.

వాస్తవానికి గత రెండు సార్లు ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలిచింది. కానీ.. ఈసారి గెలవడం అంత సులువు కాదని భారత మాజీ క్రికెటర్లే జోస్యం చెప్తున్నారు. దానికి కారణం.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ జట్టు 0-3 తేడాతో చిత్తుగా ఓడిపోవడమే.

12 ఏళ్ల తర్వాత ఊహించని ఓటమి

భారత్ గడ్డపై దాదాపు 12 ఏళ్లు.. వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో ఎవరూ ఊహించనిరీతిలో చిత్తవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ టెస్టు సిరీస్ ప్రభావం ఆస్ట్రేలియా టూర్‌లో పడకుండా చూసుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి రవిశాస్త్రి సలహా ఇచ్చాడు.

'ఐసీసీ రివ్యూ'తో రవిశాస్త్రి మాట్లాడుతూ ‘‘న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి నుంచి భారత్ కాస్త నెమ్మదిగా కోలుకుంటుంది, ఎందుకంటే ఈ రకమైన ఫలితం వస్తుందని టీమిండియా అస్సలు ఊహించలేదు. అయితే.. ఓటమి ఎదురైనా.. అందరూ గర్వించదిగిన టీమ్ భారత్ టెస్టు జట్టు. ఇలాంటి సిరీస్ ఓటమి నుంచి తిరిగి పుంజుకోవాలంటే ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌ల్లోనే మెరుగ్గా ఆడటమే ఉత్తమ మార్గం’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

ఆ విజయాల్లో టీమ్‌తోనే రవిశాస్త్రి

‘‘ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు అత్యంత కీలకం. కాబట్టి గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ టీమ్ భారత్ జట్టులోని ఆటగాళ్ల మైండ్ సెట్ బలంగా ఉండేలా చూసుకోవాలి’’ అని రవిశాస్త్రి సూచించారు. ఆస్ట్రేలియా గడ్డపై 2018-19, 2020-21 భారత్ జట్టు సిరీస్ గెలిచినప్పుడు రవిశాస్త్రి కోచ్‌గా, మెంటార్‌గా టీమ్‌తోనే ఉన్నాడు.

‘‘సిరీస్‌లో ఆటగాళ్లు నెగెటివ్ విషయాల జోలికి వెళ్లకూడదు. సానుకూల విషయాల గురించి ఆలోచించాలి. కోచ్ ఆ విషయంలో ఆటగాళ్లకి సహాయపడి వారు పాజిటివ్ మైండ్‌ సెట్‌లో ఉండేలా చూసుకోవాలి’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.

సిరీస్‌కి ముందే కవ్వింపులు

ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ల నుంచి కవ్వింపులు మొదలయ్యాయి. యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, బుమ్రాను లక్ష్యంగా చేసుకుని.. వెటకారం, ఎగతాళిగా ఆస్ట్రేలియా మాజీలు మాట్లాడుతున్నారు. సిరీస్‌కి ముందే భారత్ జట్టులోని ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా వారి కామెంట్స్ ఉన్నాయి.

Whats_app_banner