India vs Australia: మనసు మార్చుకోని భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి టెస్టుకి దూరం, బుమ్రా చేతికి పగ్గాలు
IND vs AUS 1st Test: రోహిత్ శర్మ తొలి టెస్టు కోసం పెర్త్‌కి వెళ్తాడని అంతా ఊహించారు. కానీ.. తన భార్య డెలివరీ అయినప్పటికీ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్లేందుకు హిట్ మ్యాన్ ఇష్టపడలేదు. దాంతో?
ఆస్ట్రేలియా గడ్డపై త్వరలో ప్రారంభంకానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే.. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే శుక్రవారం మగబిడ్డ (రెండవ బిడ్డ)కు జన్మనిచ్చారు. దాంతో రితిక ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని ఆశించిన రోహిత్ శర్మ.. ఆమె డెలివరీ అయిపోవడంతో తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియాకి వెళ్తాడని అంతా ఊహించారు.
ఫ్యామిలీతో గడపాలని.. తొలి టెస్టుకి దూరం
కానీ.. 37 ఏళ్ల రోహిత్ శర్మ పెర్త్ టెస్టులో ఆడటం కంటే.. తన కుటుంబంతో మరికొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నాడట. శనివారం సాయంత్రం ఈ మేరకు బీసీసీఐ పెద్దలకి కూడా భారత కెప్టెన్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. తొలి టెస్టుకి దూరంగా ఉన్నా.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకి మాత్రం అందుబాటులో ఉంటానని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమవ్వడంతో వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా.. పెర్త్ టెస్టులో టీమ్ఇండియాకు సారథ్యం వహించనున్నాడు. గతంలో కూడా జస్‌ప్రీత్ బుమ్రా కొన్ని మ్యాచ్‌లకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఓపెనర్‌గా ఎవరు?
రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమవ్వడంతో పెర్త్ టెస్టులో ఓపెనర్లుగా ఎవరెవరు ఆడతారు? అనేది పెద్ద సమస్యగా మారింది. యశస్వి జైశ్వాల్ ఇప్పటికే ఒక ఓపెనర్‌గా ఫిక్స్.. మరి అతనికి జోడీ ఎవరు? కేఎల్ రాహుల్‌కి ఓపెనర్ అనుభవం ఉన్నప్పటికీ ఫామ్‌లో లేడు. అభిమన్యు ఈశ్వరన్ ఉన్నా అతనికి అనుభవం లేదు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలి? అని టీమిండియా మేనేజ్‌మెంట్ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది.
గాయాల బెడద
ఈ తికమకకి తోడు.. గాయాలు కూడా భారత్ జట్టుని మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో భారత్-ఎ జట్టుతో మ్యాచ్ ఆడుతుండగా కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. అలానే నెం.4లో బ్యాటింగ్ చేసే శుభ్‌మన్ గిల్ ఎడమ బొటన వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. ఫీల్డింగ్ చేస్తుండగా ఈ గాయమైనట్లు తెలుస్తోంది. అలానే సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీకి కూడా గాయాలైనట్లు సమాచారం.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరాలంటే?
ఆస్ట్రేలియా గడ్డపై మొత్తం 5 టెస్టుల సిరీస్‌ను భారత్ జట్టు ఆడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరాలంటే కనీసం నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందాలి. అలానే మిగిలిన ఆ ఒక్కటిని కూడా ఓడిపోకూడదు. కనీసం డ్రా అయినా చేయాలి. ఇంత ఒత్తిడి మధ్య రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్ తొలి టెస్టుకి అందుబాటులో లేకపోవడం ఇబ్బందికర విషయమే.