Rohit Sharma: న్యూజిలాండ్‌తో భారత్ ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. అన్నీ తెలిసినా తప్పు చేశాడట!-indian captain rohit sharma takes blame for disastrous series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: న్యూజిలాండ్‌తో భారత్ ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. అన్నీ తెలిసినా తప్పు చేశాడట!

Rohit Sharma: న్యూజిలాండ్‌తో భారత్ ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. అన్నీ తెలిసినా తప్పు చేశాడట!

Galeti Rajendra HT Telugu
Nov 03, 2024 06:27 PM IST

IND vs NZ Test Series 2024: న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా వైట్‌వాష్‌తో రోహిత్ శర్మ ఎమోషనల్ అయిపోయాడు. సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ బ్యాటింగ్‌లో తానూ ఫెయిల్ అయినట్లు అంగీకరించాడు.

సిరీస్ ఓటమి తర్వాత రోహిత్ భావోద్వేగం
సిరీస్ ఓటమి తర్వాత రోహిత్ భావోద్వేగం (Surjeet Yadav)

న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడు టెస్టుల్లో ఓడిపోవడానికి తాము చేసిన తప్పిదమే కారణమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిజాయతీగా అంగీకరించాడు. వాంఖడే వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టెస్టులో 25 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ జట్టు.. మూడు టెస్టుల సిరీస్‌లో 0-3 తేడాతో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కి గురైంది.

వాంఖడే టెస్టు తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రోహిత్ శర్మ.. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి ఓపికగా సమాధానం చెప్తూ తన తప్పిదాన్ని కూడా నిజాయతీగా అంగీకరించాడు. ‘‘సొంతగడ్డపై సిరీస్ కోల్పోవడం.. టెస్టులో ఓడిపోవడం ఏ జట్టుకీ అంత సులువు కాదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఈ ఓటమి చాలా బాధాకరం.. జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

వాంఖడేలో ఆధిక్యం లభించినా..

‘‘నిజమే.. మేము ఈ సిరీస్‌లో అత్యుత్తమ క్రికెట్ ఆడలేదు. కష్టమైనా.. ఇది మేము అంగీకరించక తప్పదు. వారు (న్యూజిలాండ్) మా కంటే మెరుగ్గా సిరీస్‌లో ఆడారు. మూడు టెస్టుల్లోనూ మేము చాలా తప్పులు చేశాము. మ్యాచ్ ఫలితాలు కూడా వచ్చాయి కాబట్టి మేము తప్పుల్ని అంగీకరించాల్సిందే’’ అని రోహిత్ శర్మ నిరాశ వ్యక్తం చేశాడు.

‘‘వాస్తవానికి బెంగళూరు, పుణె టెస్టుల్లో తగినన్ని పరుగులు చేయలేకపోయాం. దాంతో ఆటలో కూడా వెనుకబడిపోయాం. కానీ వాంఖడే టెస్టులో మాకు కేవలం 30 పరుగుల ఆధిక్యం (నిజానికి లభించింది 28 పరుగుల ఆధిక్యమే) లభించింది. దాంతో మేము మ్యాచ్‌లో ముందంజలో ఉన్నామని అనుకున్నాం. ఆ తర్వాత 147 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించగలమని మేము భావించాం. కానీ అత్యుత్తమంగా ఆడలేకపోయాం’’ అని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు.

బ్యాటర్‌గా నేను ఫెయిలయ్యా

‘‘వ్యక్తిగతంగా నాకు ఈ సిరీస్‌ నిరాశ కలిగించింది. కుర్రాళ్లు రిషబ్ పంత్, యశస్వి జైశ్వాల్ భారత్ పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు చూపించారు. నిజానికి సీనియర్ ప్లేయర్‌గా ముందుండి నేను నడిపించాల్సింది. ఎందుకంటే.. గత 3-4 ఏళ్లుగా ఈ పిచ్‌లపై ఆడుతున్నాం. ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసు. కానీ.. ఈ సిరీస్‌లో ఆ పని చేయలేకపోయా’’ అని రోహిత్ శర్మ పశ్చాతాపం వ్యక్తం చేశాడు.

‘‘నేను సరిగా బ్యాటింగ్ చేయలేకపోయా. కెప్టెన్‌గా కూడా ఆ బాధ నన్ను వెంటాడింది. టీమ్‌ కూడా సమష్టిగా రాణించలేకపోయింది. అందుకే సిరీస్‌లో వరుస మ్యాచ్‌ల్లో మేం ఓడిపోయాం’’ అని రోహిత్ శర్మ అంగీకరించాడు.

నెక్ట్స్‌ ఆస్ట్రేలియా టూర్

భారత్ జట్టు నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఈ ఐదింటిలో ఒక్క టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడినా.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరడం కష్టం అవుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై.. కంగారూలను టెస్టుల్లో ఓడించడం అంత సులువు కాదు. పైగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో ఈ తరహాలో వైట్‌వాష్‌కి గురైన తర్వాత భారత్ జట్టు ఎలా పుంజుకుంటుందో చూడాలి. గత రెండు పర్యటనల్లోనూ ఆస్ట్రేలియాని టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే.

Whats_app_banner